ఇళ్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలి: సీఎం జగన్‌

23 Aug, 2021 16:22 IST|Sakshi

పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాల పంపిణీపై సమీక్ష

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సమీక్షించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘‘నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. విద్యుదీకరణకు అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో ఉంచాలి. ఇళ్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలి. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. 90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి’’ అని అన్నారు.

టిడ్కో ఇళ్లపైన సీఎం సమీక్ష సందర్భంగా.. ఫేజ్‌-1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని,  డిసెంబర్‌ 2021 నాటికల్లా ఈ ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు.. వివిధ రకాలుగా భూముల గుర్తింపు, సమీకరణ చేస్తున్నామని తెలిపారు.  విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని సీఎం ఆదేశించారు.

వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రికి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రికి దాదాపుగా రూ.32 వేలు ఆదా అయ్యిందని అధికారులు వివరించారు. లబ్దిదారుల కోరిక మేరకు వారికీ నిర్మాణ సామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన అధికారులు దీనికోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామని పేర్కొన్నారు.

విద్యుదీకరణకు అవసరమైన నాణ్యమైన సామగ్రిని కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్‌ తెలిపారు. ఆప్షన్‌ 3 కింద, అంటే ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈలోగా అందుకు అవసరమైన సన్నాహకాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 90 రోజుల్లోగా ఇళ్లపట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా సీఎం సమీక్షించారు.

చదవండి : తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి: సీఎం జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు