ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తొలగించం: సీఎం జగన్‌

17 Jun, 2021 17:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్కూళ్లు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్‌ కూడా మూతపడ్డం లేదని.. ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తీసేయడం లేదని సీఎం తెలిపారు. రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

గురువారం ఆయన నాడు–నేడుపై సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని.. ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు.

‘‘పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారు. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది. మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి.  ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం. నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదని’’ ఆయన పేర్కొన్నారు.

పౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరమని.. ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరమన్నారు. 8 సంవత్సరాలలోపు పిల్లల్లో నూరుశాతం మెదడు అభివృద్ధి చెందుతుందని.. ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలన్నారు. ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్‌ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదన్నారు. అలాగే ఒకేచోట ఎక్కువ క్లాస్‌ రూంలు పెట్టడం సరికాదని సీఎం అన్నారు.

చదవండి: ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక
బాబు అను‘కుల’ మీడియా చౌకబారు కుతంత్రాలు

మరిన్ని వార్తలు