కరోనా తగ్గుముఖం

30 Sep, 2020 04:03 IST|Sakshi

అయినా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

కోవిడ్‌పై సమీక్షలో సీఎం జగన్‌

చంద్రబాబుతో మాత్రమే కాకుండా, నెగిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా మనం పోరాడుతున్నాము. వారు మానసికంగా వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నారు. వారు నెగిటివ్‌గా రాసినా చదువుదాం. మనలో ఏమైనా లోపం ఉంటే సవరించుకుందాం. ఒకవేళ తప్పులు జరగకపోయినా రాస్తే, దానికి గట్టిగా సమాధానం చెప్పాలి. ప్రజల్లో ఎండగట్టాలి.

రాష్ట్రంలోని 240 కోవిడ్‌ ఆస్పత్రుల్లో దాదాపు 37 వేల బెడ్లు ఉన్నాయి. వాటిలో వైద్య సదుపాయాలు, ఆహారం నాణ్యత, శానిటేషన్, వైద్యుల అందుబాటుపై ఎప్పటికప్పుడు జేసీలు సమీక్షించాలి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో పౌష్టికాహారం అందించాలి. వాటిలో కూడా హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయాలి. ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని, పాజిటివిటీ రేటు 8.3 శాతానికి తగ్గడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 56.66 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని, కరోనా మరణాలు కూడా తగ్గాయన్నారు. ప్రస్తుతం కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కోవిడ్‌–19 నివారణ చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కోవిడ్‌ ఆస్పత్రులు – సమాచారం
► రాష్ట్రంలో 240 కోవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో నమోదైన ఆస్పత్రుల్లో కూడా కోవిడ్‌ చికిత్స చేయాలని ఆదేశించాం. ఏయే ఆస్పత్రులలో కోవిడ్‌ చికిత్స అందుతోందనే సమాచారం తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. 
► కోవిడ్, ఆరోగ్రశ్రీ ఆస్పత్రుల సమాచారం కూడా అందుబాటులో ఉండాలి. ఆ సమాచారం వలంటీర్లకు కూడా తెలియాలి. కోవిడ్‌ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం మన బా«ధ్యత. 
► కోవిడ్‌ సమయంలో మెరుగైన వైద్య సేవలందించడం కోసం తాత్కాలిక ప్రాతిపదికన 6 నెలల కోసం వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది దాదాపు 17 వేల మంది నియామకానికి ఆదేశాలు జారీ చేశాం. వారితో పాటు మరో 12 వేల మంది శిక్షణ నర్సులను నియమించుకోవాలని చెప్పాం. ప్రస్తుతం దాదాపు 20 వేల మంది సిబ్బంది నియామకం జరిగింది. 
► ఈ వారం చివరిలోగా అందరి నియామకాలు పూర్తి చేయాలి. వారు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారా? విధులకు హాజరవుతున్నారా? అన్నది చూడాలి.

కిట్‌లు అందించే బాధ్యత కలెక్టర్లు, జేసీలదే
► హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన మందులతో కూడిన కిట్‌ను అందజేయాలి. ఎక్కడైనా అవి అందలేదంటే కలెక్టర్లు, జేసీలను బాధ్యులను చేస్తాము. 2 వారాల పాటు స్థానిక వైద్యాధికారి ఫోన్‌లో అందుబాటులో ఉండాలి. 
► 10 రోజుల్లో కనీసం రెండు సార్లు వ్యక్తిగతంగా కలవాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో పాటు, పీహెచ్‌సీలలో ఉన్న వైద్యులు తప్పనిసరిగా విజిట్‌ చేయాలి. కోవిడ్‌ నియంత్రణలో మీరు (జిల్లాల అధికారులు) చాలా బాగా పని చేసినందుకు అభినందనలు.

104 నంబర్‌కు ప్రాచుర్యం కల్పించాలి
► 104 నంబర్‌ సింగిల్‌ సోర్స్‌ కాబట్టి, తప్పనిసరిగా అటెండ్‌ చేయాలి. కాల్‌ వచ్చిన వెంటనే కోవిడ్‌కు సంబంధించి పరీక్ష లేదా ఆస్పత్రిలో చేర్పించడం వంటివి పక్కాగా జరగాలి. ఆ నంబర్‌ పని తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అందుకోసం రోజూ మాక్‌ డ్రిల్‌ (కాల్‌) తప్పనిసరి.
► ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే అర గంటలోనే బెడ్‌ సమకూరుస్తామని చెబుతున్నాం కాబట్టి, మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. 104 నంబర్‌కు ప్రాచుర్యం కల్పిస్తూ ఊరూరా ప్రచారం చేయాలి. దీంతో పాటు జిల్లాలలో ఏర్పాటు చేసుకున్న హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ను కూడా బాగా ప్రచారం చేయాలి. 

మరిన్ని వార్తలు