‘కోవిడ్‌ చికిత్సకు‌ అదనంగా రూ.1000 కోట్లు’

24 Jul, 2020 14:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.

కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్‌ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్‌ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్‌కేర్‌ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్‌ కేర్‌ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులుగా మార్చామన్నారు.

కాగా, వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. క్వారంటైన్‌ సెంటర్లలో సేవలపై ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు.
(చదవండి: కొత్త మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు)

రికార్డుస్థాయిలో పరీక్షలు
రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, పాజిటివిటీ అంశాలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రోజుకు రికార్డు స్థాయిలో 58వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్‌ మెంట్‌ క్లస్టర్లు, కోవిడ్‌ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టి పెట్టి ఈ పరీక్షలు చేస్తున్నామని, దీనివల్ల పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరిగిందని వివరించారు. దాదాపు 90 శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఈ అంకెలను చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. 

నిమ్మ ధరలపై కీలక ఆదేశం
రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. రేపటి నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు. రైతుకు మద్దతు ధర  వచేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
(ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు