ఏపీ: సర్వ సమగ్రంగా సర్వే.. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా..

13 Aug, 2021 07:27 IST|Sakshi

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’పై సీఎం జగన్‌ సమీక్ష

2023 జూన్‌ నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి

లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ముందుకు సాగాలి

డ్రోన్లు సహా అవసరమైనవన్నీ కొనుగోలు చేయండి

సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేసుకుని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి

త్వరితగతిన పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలి

సర్వే ఆఫ్‌ ఇండియా సహకారం కూడా తీసుకోవాలి

ఆదర్శంగా సర్వే ప్రక్రియ.. ఎక్కడా అవినీతికి తావు ఉండరాదు

వారానికి ఒకసారి మంత్రుల కమిటీ సమీక్షించాలి

4 వారాలకు ఒకసారి పురోగతిని నేనే పరిశీలిస్తా

స్పందనలో కూడా దీనిపై సమీక్ష చేపడతాం 

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకం కింద రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ముందుకు సాగాలని, ఇందుకు అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. డ్రోన్లు సహా ఎన్ని అవసరమో అన్నీ కొనుగోలు చేయాలని, తగిన సాఫ్ట్‌వేర్‌ సమకూర్చుకోవడంతోపాటు సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని సూచించారు. సర్వే త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం అమలుపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా... 
వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. నిర్దేశిత గడువులోగా సమగ్ర సర్వే పూర్తయ్యేలా అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని ఆదేశించారు. పారదర్శకంగా, ఆదర్శంగా సర్వే ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు.

సర్వే కాగానే రైతులకు భూమి కార్డులు 
సర్వే చేసిన వెంటనే గ్రామాలవారీగా మ్యాపులతో సైతం రికార్డులు అప్‌డేట్‌ కావాలని, భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని సీఎం సూచించారు. అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. వనరులన్నీ సమకూర్చుకోవాలని, డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేరకు కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాప్ట్‌వేర్‌ సమకూర్చుకుని సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు నిపుణుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగరాదు..
ఇంత పెద్దఎత్తున భూముల సర్వే ప్రాజెక్టును చేపడుతున్నందున అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, శిక్షణ.. ఇలా అన్ని అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సర్వే సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

ప్రతి వారం కేబినెట్‌ సబ్‌ కమిటీ సమీక్ష
సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని, సర్వే ప్రక్రియపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్దేశించుకున్న గడువు లోగా ప్రాజెక్టు పూర్తి కావాల్సిందేనని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియాతో సమన్వయం చేసుకుని వారి సహకారా>న్ని కూడా తీసుకోవాలని సూచించారు. సర్వే రాళ్లకు కొరత లేకుండా చూడాలని, సకాలంలో వాటిని అప్పగించాలని భూగర్భ గనులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.


నవంబర్‌ నుంచి సర్వే రాళ్ల తయారీ..
నాలుగు ప్లాంట్లలో నవంబర్‌ నుంచి సర్వే రాళ్ల తయారీ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోజుకు ఒక్కో ప్లాంట్‌ నుంచి నాలుగు వేలు చొప్పున నిత్యం 16 వేల సర్వే రాళ్లు తయారవుతాయని భూగర్భ గనుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కచ్చితంగా గడువులోగా పూర్తి చేస్తాం
అనుకున్న సమయానికి సమగ్ర భూసర్వేను కచ్చితంగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్ధానంలో నిలబెడతామని ముఖ్యమంత్రికి తెలియచేశారు. సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు