జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్‌ సమీక్ష

21 Oct, 2022 18:16 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులోని ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌)లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సీఎం చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందని అధికారులు తెలిపారు. 

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు చేయాలని.. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని పేర్కొన్నారు. కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్‌ పటిష్టతపై నిర్ధారణల కోసం పరీక్షలు నవంబర్‌ మధ్యంతరం నుంచి మొదలవుతాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వీటి తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ పరీక్షలు నడుస్తున్న సమయంలోనే మరోవైపు దిగువ కాఫర్‌డ్యాం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దిగువ కాఫర్‌ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్‌ పూర్తిచేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈలోగా ఆర్‌అండ్‌ఆర్‌ పనుల్లో ప్రాధాన్యతగా క్రమంలో నిర్దేశించుకున్న విధంగా 41.15 మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అధికారునలు సీఎం జగన్‌ ఆదేశించారు.
చదవండి: ‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’

గోదావరిలో నిరంతరం ప్రవాహం
►1990 తర్వాత అత్యధికంగా వరద 
► జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద.
►ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కుల వరద.
► ఆగస్టు 19న 15.92లక్షల క్యూసెక్కుల వరద. 
►సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద. 
► ఇప్పటికీ రెండున్నరల లక్షల క్యూసెక్కులకు పైగా వరద.
►1990లో 355 రోజుల ప్రవాహం. 7,092 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. 

►1994లో 188 రోజుల వరద, 5,959 టీఎంసీల నీరు సముద్రంలో కలయిక. 
► 2013లో 213రోజుల వరద, 5,921 టీఎంసీల నీరు సముద్రంలోకి. 
► 2022లో 136 రోజుల వరద, 6,010 టీఎంసీల నీరు సముంద్రంలోకి. 
►కృష్ణానదిలో కూడా 1164.10 టీఎంసీల నీరు సముద్రంలోకి. 

►వంశధారలోకూడా వరద జలాలు, 119.2 టీఎంసీలు సముద్రంలోకి
► నాగావళి ద్వారా 34.8 టీఎంసీలు సముద్రంలోకి
►పెన్నా నుంచి 92.41 టీఎంసీలు సముద్రంలోకి.
► ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్లగ్‌ కుషన్‌ పెట్టుకోగా రిజర్వాయర్లు అన్నింటిలో దాదాపు 90శాతం నీటి నిల్వ.
►గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు టెండర్లు ప్రక్రియ ప్రారంభం. డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు. 

►విజయనగరం జిల్లా తారక రామ తీర్థసాగర్‌ పనులు నవంబర్‌లో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాలమేరకు మహేంద్ర తనయ పనులు పునరుద్ధరణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ.852 కోట్లతో రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ చేసి త్వరలో టెండర్‌ ప్రక్రియను ఖరారు చేస్తామని, అవుకు టన్నెల్‌ పనులు కూడా పూర్తికావొస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
వెలిగొండ టన్నెల్‌ –2లో  మిగిలి ఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీటన్నింటితోపాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు కూడా జూన్‌ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

లిఫ్ట్‌ స్కీంల నిర్వహణ కోసం ఎస్‌ఓపీ
ఏళ్లకొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలన పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే వీటి నిర్వహణపై ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో ఈ ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు.  వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలని,  ప్రభుత్వం నుంచి ఒక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.  కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన, వారికి శిక్షణ  ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
 
ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు