కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశం

9 Aug, 2021 17:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వక్ఫ్‌ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు. మైనారిటీ సంక్షేమశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. భూముల చట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు.వైఎస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు.. వక్ఫ్ ఆస్తులను కూడా సర్వే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మైనార్టీలకూ సబ్‌ ప్లాన్ కోసం చర్యలు తీసుకోవాలి
మైనార్టీలకు కొత్త శ్మశానవాటికల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వాటి నిర్మాణాలు చేపట్టాలని, ఇమామ్‌లు, మౌజమ్‌, పాస్లర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లించాలని తెలిపారు. మైనార్టీలకూ సబ్‌ ప్లాన్ కోసం సంబంధించిన చర్యలు తీసుకోవాలని, మైనార్టీశాఖలో పెండింగ్ సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. కర్నూలులో ఉర్దూ వర్శిటీ పనులను నాడు -నేడు తరహాలో చేపట్టాలని, ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని  సీఎం అధికారుకు సూచించారు. 

విజయవాడ - గుంటూరు పరిసరాల్లో హజ్‌ హౌస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌
ఉర్దూ అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధి చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనార్టీశాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మైనార్టీశాఖలో ఖాళీ పోస్టుల నియామకాలను.. ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విజయవాడ - గుంటూరు పరిసరాల్లో హజ్‌ హౌస్ నిర్మాణానికి సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. హజ్‌ కమిటీలు, వక్ఫ్‌ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని, గుంటూరు జిల్లా గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్‌ పనులు పూర్తి చేయాలని  సీఎం జగన్‌ అధికారును ఆదేశించారు.

మరిన్ని వార్తలు