నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

26 Nov, 2022 03:56 IST|Sakshi

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

నెల రోజుల్లో ఏపీ సీఎం ఎంఎస్‌ యాప్‌

రోడ్ల మరమ్మతులు, గుంతలు, ట్రాఫిక్‌ తదితర సమస్యలపై దృష్టి 

ఎవరైనా సరే ఫొటో అప్‌లోడ్‌ చేయగానే నిర్దిష్ట వ్యవధిలోగా పరిష్కారం

4,119 వార్డు సచివాలయాల పరిధిలో నిరంతర పర్యవేక్షణ

మున్సిపల్‌ విభాగాల్లో వేగ వంతమైన సేవల కోసం చర్యలు

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇందుకోసం ‘ఏపీ సీఎం ఎంఎస్‌’ (ఏపీ కన్సిస్టెంట్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ మున్సిపల్‌ సర్వీసెస్‌) పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో సిద్ధమయ్యే ఈ యాప్‌ ద్వారా నగరాలు, పట్టణాల్లో ఎవరైనా సరే రోడ్ల సంబంధిత సమస్యలపై ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయగానే, నిర్దిష్ట వ్యవధిలోగా మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టాణాల్లోని సమస్యలపై రియల్‌ టైం మానిటరింగ్‌ ద్వారా దృష్టి సారించాలని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు అవసరమైన సేవలు సత్వరం అందాలి. ఆయా విభాగాల అధికారులు నిర్దేశిత సమయంలోగా అనుమతులు మంజూరు చేయాలి. అన్ని సేవలు త్వరితగతిన అందేలా పాలనలో మార్పులు తీసుకురావాలి. ప్లాన్‌ అప్రూవల్‌ తదితర ప్రజా సేవలు సత్వరమే అందించడం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లపై నిశితంగా సమీక్షించి, తగిన ప్రణాళికను రూపొందించాలి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వార్డుల్లో రోజూ 2 గంటలు తనిఖీలు
 రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ప్రజా సమస్యలపై తనిఖీలు చేపట్టాలి. తమ పరిధిలోని సుమారు 6– 7 కి.మీ మేర రోడ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. 
తమ పరిధిలో రోడ్లు ఎలా ఉన్నాయి.. గుంతలు, కంకర కొట్టుకు పోవడం, పచ్చదనం తదితర వాటిని పరిశీలించడంతో పాటు వీధి లైట్లు, పుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌ జంక్షన్ల పని తీరునూ గమనించాలి. వార్డు సచివాలయ పరిధిలో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్‌లో అప్‌ లోడ్‌ చేయడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. 
సిబ్బంది మాత్రమే కాకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సామాన్య ప్రజలు కూడా తమ దృష్టికి వచ్చిన ఈ సమస్యలను యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. 
► యాప్‌ ద్వారా అందిన సమస్యలు సంబంధిత విభాగాలకు వెళ్లగానే నిర్ణీత వ్యవధిలోగా వాటిని పరిష్కరించాలి. అందుకు అనగుణంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. 

గ్రామాలకు ఇదే తరహా యాప్‌
నగరాలు, పట్టణాల్లో తీసుకువస్తున్న ఈ యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలి. నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా మెరుగైన రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. దీర్ఘకాలం మన్నేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలి.  
► ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ పి.సంపత్‌ కుమార్, ఏపీజీబీసీఎల్‌ ఎండీ బి.రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 
రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ కార్పొరేషన్‌ పరిధితో పాటు సమీపంలోని మరో 28 అర్బన్‌ లోకల్‌బాడీల నుంచి వచ్చే చెత్తను ఇక్కడ ప్రాసెస్‌ చేసేలా ప్లాంట్‌ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు