పంటల అమ్మకం కష్టం కాకూడదు

25 Jul, 2020 03:31 IST|Sakshi
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అరటి, చీని, టమాటా  లాంటి రైతుల్లో ఏటా ఆందోళన  

ఆయా పంటల విషయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి

ఈ సీజన్‌ నుంచి రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు

ఎంత ఖర్చు అయినా పర్వాలేదు.. శాశ్వత పరిష్కారం చూపాలి 

ప్రధానంగా ఇబ్బందులు వస్తున్న ఏడెనిమిది పంటలను గుర్తించాలి 

ఆర్‌బీకే, మండల, నియోజకవర్గ స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జరగాలి 

వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి 

ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై సమీక్షలో సీఎం జగన్‌

పంటలకు తగిన మార్కెటింగ్‌ లేక, కనీస గిట్టుబాటు ధరలు రాక ఏటా అరటి, చీని,టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, మిర్చి తదితర పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు అమ్ముకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయా పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి. మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి.
    – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడకూడదని, వారు ఎక్కడా రోడ్డెక్కే పరిస్థితి కనిపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని పంటలకు మార్కెటింగ్‌ లేక కనీస గిట్టుబాటు ధరలు రాని అంశాన్ని స్వయంగా ఆయనే ప్రస్తావించారు. ఈ సీజన్‌ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలని, దీని కోసం ఎంత ఖర్చు అయినా పర్వా లేదన్నారు.  ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. 

శాశ్వత పరిష్కారం కావాలి
► రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఏ పంట, ఎంత వరకు కొనుగోలు చేయాలి? ఎంత మేర ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు తర లించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. 
► పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో పాటు, వాటి మార్కెటింగ్‌లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది.  అవసరమైతే ధరల స్థిరీకరణ నిధి ఉపయోగిస్తుంది. ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్లు వ్యయం చేశాం. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవస్థీకృతంగా సిద్ధం కావాలి. 
► వచ్చే సీజన్‌ కల్లా రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా మార్కెటింగ్‌ లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులకు ప్రధానంగా ఇబ్బందులు తెస్తున్న ఏడెనిమిది పంటలను గుర్తించాలి. వాటి ప్రాసెసింగ్‌తో పాటు, వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో ఆలోచించాలి. వీటి కోసం మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి.  
► ప్రాథమికంగా ఆర్‌బీకే స్థాయిలో, ఆ తర్వాత మండల, నియోజకవర్గ స్థాయిల్లో  అంచనాలు తయారు చేయాలి.
► వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు