గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష

10 Aug, 2020 13:50 IST|Sakshi

పీఎంయూ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు పడింది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పీఎంయూ అప్రమత్తం చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా  పీఎంయూను ఏర్పాటు చేశారు. మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు. (బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం)

సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఇంటర్నెట్ లేని 512 సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు. ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేసి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

‘‘గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలి. ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నా.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్‌ ప్లాన్‌కు సన్నద్ధం కావాలని’’ సీఎం సూచించారు.

నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని అధికారులు వెల్లడించారు. ల్యాండ్‌ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్‌ ప్రకటించి, ఈ షెడ్యూల్‌ను తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు