భూముల రీసర్వే అత్యంత ప్రాధాన్యం: సీఎం జగన్‌

1 Apr, 2023 08:18 IST|Sakshi

ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం

ఎవరూ టాంపర్‌ చేయలేని విధంగా భూ హక్కు పత్రాలు

నిర్దేశించిన లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి

ప్రతి గ్రామ సచివాలయంలో క్రమంగా సర్వే పరికరాలు

మున్సిపల్‌ ప్రాంతాల్లో సర్వే కోసం సన్నాహాలు

మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పని పూర్తి చేయాలి. రీ సర్వే కోసం రోవర్‌తోపాటు ఇతర పరికరాలు క్రమంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఉండేలా చూసుకోవాలి. అందుబాటులో ఉన్న సాంకేతికతనూ ఉపయోగించుకోవాలి. దీనివల్ల సర్వేయర్‌ పూర్తి స్థాయిలో తన పని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుంది. భవిష్యత్‌ తరాల వారికి కూడా ఇది చాలా ఉపయోగకరం కాబట్టి ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద స్థాయిలో భూముల రీ సర్వే చేపట్టడం లేదని తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ పథకంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సి­పల్, గనుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూముల రీ సర్వే ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్‌ చేయలేని విధంగా భూ యజమానులకు భూ హక్కు పత్రాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఇప్పటి వారికే కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా చాలా ఉపయోగమని తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే చాలా వరకు భూ హక్కుల పత్రాల పంపిణీ జరుగుతోందని తెలిపారు.   

సర్వే రాళ్ల కొరత లేకుండా చూడాలి 
సర్వే పూర్తయ్యాక సరిహద్దుల వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. తర్వాత దశల్లో జరిగే సర్వే కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్‌ ప్రాంతాల్లో సర్వే కోసం సన్నాహాలు చేస్తున్నామని మున్సిపల్‌ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతోందన్నారు.

నిర్దేశించుకున్న టైమ్‌ లైన్స్‌ ప్రకారం కచ్చితంగా సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్‌ మూడో వారం నాటికి 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని పంచాయతీ రాజ్‌ శాఖాధికారులు తెలిపారు. డిసెంబర్‌లోగా మొత్తం అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి సాయిప్రసాద్, వై శ్రీలక్ష్మి, బుడితి రాజశేఖర్, రజత్‌ భార్గవ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సర్వే సెటిల్మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థ జైన్, భూ పరిపాలన అదనపు చీఫ్‌ కమిషనర్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు