రహదారుల అభివృద్ధిలో ముందడుగు 

18 Feb, 2022 03:45 IST|Sakshi
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.10,400 కోట్లతో రహదారుల నిర్మాణం

జిల్లా కేంద్రాలు–మండలాలను అనుసంధానిస్తూ రెండు లేన్ల రహదారులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే విజయవాడలో ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి పలు రహదారులకు ప్రారంభోత్సవం, భూమిపూజ నిర్వహించిన సీఎం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా–మండల కేంద్రాలను అనుసంధానించే రహదారులను వేగంగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణకు అవసరమైన అన్ని చర్యలకు చొరవ చూపిస్తున్నామని చెప్పారు. భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. రహదారుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర రహదారులు, జిల్లా కేంద్రాలు–మండల కేంద్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,400 కోట్లతో పనులు చేపట్టిందని తెలిపారు.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ రాష్ట్రంలో 1,380 కిలోమీటర్ల మేర చేపట్టిన 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులలో 20 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 31 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సంయుక్తంగా ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అనంతపురంలలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఐఐసీ పరస్పరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..    
లాజిస్టిక్‌ పార్క్‌ల ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పంద పత్రాలతో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి శంకరనారాయణ తదితరులు 

జాతీయ రహదారుల అభివృద్ధిలో ముందడుగు 
► కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దార్శనికతతో దేశంలో సాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ ట్రాక్స్‌ కార్యక్రమం నితిన్‌ గడ్కరీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. 
► 2014 నాటికి దేశంలో రోజుకు 12 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా, గడ్కరీ హయాంలో ప్రస్తుతం రోజుకు 37 కిలోమీటర్ల మేర నిర్మించే స్థాయికి చేరుకుంది.  
► ఆంధ్రప్రదేశ్‌లో 4,193 కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ రహదారులు 95 శాతం పెరుగుదలతో ప్రస్తుతం 8,163 కిలోమీటర్లకు చేరాయి. ప్రస్తుతం 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ముందడుగు పడుతోంది. అందులో రూ.10,400 కోట్లతో నిర్మించనున్న 741 కిలోమీటర్ల పొడవైన 31 రహదారులకు శంకుస్థాపన చేస్తున్నాం.  
► ఇప్పటికే రూ.11,159 కోట్లతో నిర్మించిన మరో 20 రహదారులను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని 2019 ఆగస్టులో నేను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి స్వయంగా విజ్ఞప్తి చేశాను. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ఫ్లై ఓవర్‌ మంజూరు చేశారు.  
► 2020లోనే ఫ్లై ఓవర్‌ మంజూరు చేసి, వేగంగా నిర్మించి ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చే నాటికి విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ తూర్పు ఫ్లై ఓవర్, కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో వాయు వేగంతో పూర్తి చేయగలిగాం.   

ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టవిటీ 
► రాష్ట్రంలో జాతీయ రహదారులు కాకుండా మిగిలిన రహదారుల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం రూ.10,600 కోట్లు కేటాయించాం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు రెండు లేన్ల రోడ్లు వేస్తున్నాం. అందుకు రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.  
► రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసమే మరో రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తూ.. ఇతరత్రా మొత్తం కలిపి రూ.10,600 కోట్లతో రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.  
► రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికీ ఎటువంటి సంకోచం, రాజకీయాలు లేకుండా ప్రజల ముందు మా సంతోషం, కృతజ్ఞతలూ తెలుపుతున్నాం.  

కేంద్రానికి మరికొన్ని ప్రతిపాదనలు 
► మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాను.  
► విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలి. ప్రకృతి అందాలతో కూడిన రుషికొండ, భీమిలి కొండలు, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా.. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు కనెక్ట్‌ చేసే విధంగా నేషనల్‌ హైవే 60ని కలుçపుతూ 6 లేన్ల రహదారి నిర్మాణం చాలా అవసరం.  
► విజయవాడ తూర్పు బైపాస్‌.. కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. విజయవాడలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఈ బైపాస్‌ నిర్మాణం చాలా అవసరం. మీరు వెస్ట్రన్‌ బైపాస్‌ మంజూరు చేశారు. ఈస్ట్రన్‌ బైపాస్‌ కూడా మంజూరు చేయాలని కోరుతున్నా. జాతీయ రహదారులు నగరం మీదుగా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ ఈ రెండు బైపాస్‌ల నిర్మాణమే పరిష్కారం. 

వీటిని జాతీయ రహదారులుగా ప్రకటించాలి 
► వైఎస్సార్‌ జిల్లా భాకరాపేట – బద్వేలు 
► వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల – ప్రకాశం జిల్లా బెస్తవారిపేట  
► చిత్తూరు జిల్లా పుంగనూరు – పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు  
► విశాఖపట్నం జిల్లా సబ్బవరం – చోడవరం  
► విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం – తుని  
► విశాఖపట్నం – నర్సీపట్నం – చింతపల్లి – చింతూరు – భద్రాచలం  
► ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖకు పంపించాం. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వాటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. 
► జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర రహదారులపై ఆర్వోబీల నిర్మాణాల కోసం ఇటీవల కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం.  

మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మన రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తున్న తెలుగు వారైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ దిశగా మరింత చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నా.   

>
మరిన్ని వార్తలు