నదీ జలాల పంపిణీ విధానం మారాలి

15 Nov, 2021 02:43 IST|Sakshi

15 రోజులకోసారి పంపిణీ చేయాలి 

ప్రస్తుత విధానంతో నష్టపోతున్న దిగువ రాష్ట్రాలు  

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదన.. పరిశీలిస్తామన్న కేంద్రం 

పులికాట్‌లో చేపల వేట సమస్య పరిష్కారం 

ఇతరత్రా అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న అమిత్‌ షా 

తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: ‘ప్రస్తుత నదీ జలాల పంపిణీ విధానంతో దిగువ రాష్ట్రాలు నష్టపోతున్నాయి.  కాబట్టి నీటి పంపిణీ విధానాన్ని పునఃసమీక్షించాలి. ప్రతి 15 రోజులకు ఓసారి అంచనా వేసి నీటి పంపిణీ చేయాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో నదీ జలాల అంశంపై ఆయన మాట్లాడుతూ చేసిన కీలక సూచనలను పరిశీలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఈ సమావేశంలో ‘ఇంద్రావతి–కావేరి–కృష్ణా–పెన్నా–గోదావరి’ నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన విషయాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. ‘రాష్ట్రంలో జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు 2,500 టీఎంసీల ప్రవాహం ఉంటుంది.

శ్రీశైలం, నాగార్జున సాగర్, బనకచర్ల, సోమశిల వరకు భూ భాగం అంతా ఏపీలోనే ఉంది. కాబట్టి ఆ నాలుగైదు నెలల్లో నీటిని తరలించుకోవచ్చు. నదుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. నీటి కొరత ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని ఒడిసి పడుతున్నాయి. మరోవైపు అకస్మాత్తుగా వరదలు వస్తే దిగువ ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. నదుల్లో నీరు లేనప్పుడు నీటి కొరతతో, భారీగా నీళ్లు ఉన్నప్పుడు వరదలతో దిగువన ఉన్న రాష్ట్రాల వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రతి 15 రోజులకోసారి రిజర్వాయర్లు, డ్యాంలలో నీటిని పరిగణనలోకి తీసుకుని కేటాయింపుల ప్రాతిపదిక నిష్పత్తిన పంపిణీని చేపట్టాలి. దాంతో ఎవ్వరికీ ఇబ్బంది రాదు’ అని సీఎం జగన్‌ చెప్పారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సానుకూలంగా స్పందిస్తూ డీపీఆర్‌ రూపొందించిన తర్వాత అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.   

సమావేశంలో కీలకాంశాలు ఇలా.. 
► వివిధ కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు మరికొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 
► పులికాట్‌ సరస్సులో తమిళనాడుతో నెలకొన్న వివాద పరిష్కారానికి ఏపీ సూచనలను కేంద్రం ఆమోదించింది. చేపల వేట కోసం పులికాట్‌ సముద్ర తీర ముఖ ద్వారాన్ని తెరిచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని షార్‌ తెలిపింది. కళంగిని, స్వర్ణముఖి నదీ ద్వారాలను తెరవడానికి అభ్యంతరం లేదని చెప్పింది. దాంతో ఏపీ సూచించిన మేరకు చేపల వేట సమస్య పరిష్కారానికి సాంకేతిక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధికారులను ఆదేశించారు.  
► చేపల వేటపై ఏపీ, తమిళనాడు మత్స్యకారులు ఒకరి సరిహద్దులు మరొకరు అతిక్రమించకూడదన్నారు. అందుకోసం ఇరు రాష్ట్రాల మత్స్యకారులకు ఇచ్చే గుర్తింపు కార్డుల్లో ప్రత్యేక కలర్‌ కోడ్‌ను ఇవ్వాలని ప్రతిపాదించారు.  
► రొయ్యల్లో యాంటి బయాటిక్‌ అవశేషాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రశంసించింది. అందుకు ఏపీ ప్రత్యేక చట్టాన్ని చేయడంతోపాటు టాస్క్‌ఫోర్స్‌లను కూడా ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని పలువురు పేర్కొన్నారు. ఈ తరహా చర్యలను కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి చేపట్టాలని మండలి సూచించింది. 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్రాలు తెలిపాయి.  
► తాము తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటిని ఇస్తున్న విషయాన్ని తమిళనాడు గుర్తుంచుకొని పాలారు ప్రాజెక్టుకు సహకరించాలని మంత్రి బుగ్గన కోరారు.   
► తెలుగు గంగ బకాయిల గురించి తమిళనాడు మంత్రి పొన్‌ముడి స్పందిస్తూ.. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించామని, మిగిలిన రూ.300 కోట్లు త్వరలో ఇస్తామని చెప్పారు.   
► తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలకు సంబంధించి ఇరు రాష్ట్రాలతో  మరోసారి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని అమిత్‌ షా చెప్పారు. మధ్యప్రదేశ్, యూపీ, బిహార్‌ రాష్ట్రాల విభజన సమయంలో ఎలా వ్యవహరించారో ఈ విషయంలో అలా వ్యవహరించాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు.  
► పాలమూరు –రంగారెడ్డి, నక్కల గండి ఎత్తిపోతల పథకంపై çకర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టులపై జనవరి 15లోగా తెలంగాణ డీపీఆర్‌ సమర్పిస్తుందని కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.    

మరిన్ని వార్తలు