కేంద్రంతో మాట్లాడే బాధ్యత మాది: సీఎం జగన్‌

16 Dec, 2020 03:31 IST|Sakshi
రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోకి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా నగదును జమచేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి కన్నబాబు

వారి కష్టాలను స్వయంగా చూసినందునే పంటల బీమా విధానంలో సమూల మార్పులు

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 9.48 లక్షల మంది రైతులకు రూ.1,252 కోట్ల పరిహారం చెల్లింపు కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

గతంలో పంటల బీమాపై అన్నదాతలకు నమ్మకం లేదు

గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. ప్రీమియం పేరుతో భారం

నేడు రైతులకు అండగా నిలవాలనే విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు

బీమా పరిధిలోకి 50 లక్షల మంది రైతులు

2020 పంటల బీమా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో చెల్లింపు

వర్షాలతో పాడైన పంటలకు డిసెంబర్‌ 31న పరిహారం 

చరిత్రలో తొలిసారిగా రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ విషయాన్ని నిస్సందేహంగా చెబుతున్నా. విత్తనాలు మొదలు పంట అమ్ముకునే వరకూ అండగా ఉంటున్నాం. మంచి మనసుతో రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో గత 18 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పంటల బీమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతులకు గుదిబండ కాకుండా వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఏకంగా 50 లక్షల మంది రైతులకు చెందిన కోటి 14 లక్షల ఎకరాలకు బీమాను వర్తింప చేస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పంటల బీమా పట్ల రైతుల్లో విశ్వసనీయత కల్పించామని, పంట నష్టపోతే ఇప్పుడు పంటల బీమా పరిహారం వస్తుందనే నమ్మకం వారిలో కలిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో పంటల బీమాపై నమ్మకం లేదని, అందుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని తెలిపారు. నష్టపోయిన రైతులకు బీమా కల్పించకపోగా, ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం వారిపై మోపిందన్నారు. రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తన కళ్లతో చూశానని, అందుకే పంటల బీమా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. 2019 సీజన్‌కు సంబంధించి పంటలు కోల్పోయిన 9.48 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.1,252 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పంటల బీమా లబ్ధిదారులైన రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

నాడు మూడు భాగాలుగా..
► గతంలో ఇన్సూరెన్స్‌ పరిస్థితి దారుణం. ఇన్సూరెన్స్‌ ప్రీమియంను రైతులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేర్వేరుగా మూడు భాగాల్లో కట్టేవారు. దీంతో రైతుల తరఫున సంప్రదించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో ఇన్సూరెన్స్‌ సక్రమంగా వచ్చేది కాదు. అందువల్ల చాలా తక్కువ మంది రైతులు బీమా చేయించే వారు. పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ స్వయంగా చూశాను. 2012 ఏడాదికి సంబంధించిన ఇన్సూరెన్స్‌ రాలేదు. మన ప్రభుత్వం వచ్చాక వారికి ప్రీమియం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి ఆ బీమా పరిహారం ఇప్పించాం. 
► 2016–17, 2017–18, 2018–19 వరకు రైతులు ఏటా సగటున రూ.290 కోట్ల ప్రీమియమ్‌ మాత్రమే కట్టారు. అప్పటి ప్రభుత్వం తన వాటాగా సగటున చెల్లించిన ప్రీమియం కేవలం రూ.393 కోట్లు మాత్రమే. 
► 2016–17లో 17.79 లక్షల మంది రైతులు, 2017–18లో 18.22 లక్షలు, 2018–19లో 24.83 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఏటా సగటున 20 లక్షల మంది రైతులు కూడా బీమా చేయించుకోని పరిస్థితి.   

అడుగడుగునా అండగా నిలుస్తున్నాం
► మన ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా రైతులకు అండగా నిలిచింది. అందుకే రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా రూ.468 కోట్లతో పాటు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు.. రెండూ కలిపి రూ.971 కోట్ల ప్రీమియం చెల్లించింది.
► ఇప్పుడు మన ప్రభుత్వం అక్షరాలా 49.80 లక్షల మంది రైతుల తరపున ప్రీమియం కడుతోంది. అప్పట్లో మూడేళ్లలో సగటున కేవలం 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే బీమా పరిధిలోని వస్తే, ఇప్పుడు 45.96 లక్షల హెక్టార్లు, అంటే 1.14 కోట్ల ఎకరాలను ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తెచ్చాం.
► విత్తనం వేసినా పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు, కరువు, వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా మన ప్రభుత్వం మనసు పెడుతోంది. ఇన్సూరెన్స్‌ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యతను కూడా ప్రభుత్వ భుజస్కంధాలపై వేసుకున్నాం. ఇందుకు ఈ రోజు రైతులకు ఇస్తున్న ఈ పంటల బీమా పరిహారమే ఉదాహరణ.
► బీమా పరిహారాన్ని డిసెంబర్‌ 15వ తేదీన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో, అసెంబ్లీ సమావేశాలకు ముందు క్యాబినెట్‌ సమావేశంలో చెప్పాం. ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నాం. 

ఆర్బీకేలతో అన్ని విధాలా భరోసా
► రాష్ట్రంలో ఇవాళ 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) గ్రామ సచివాలయాలకు అనుసంధానమై పని చేస్తున్నాయి. అన్ని పంటల ఈ–క్రాపింగ్‌ జరుగుతోంది. ఆ వివరాలను ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. 
► ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టంపై అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్నాం. ఇటీవల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 31న ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేస్తాం. 
► ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకు లాభం ఉంటుంది. రైతుల బీమా కూడా కట్టి, ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నాం. ఈ–క్రాప్‌ ద్వారా చాలా వేగంగా పరిహారం ఇచ్చే వీలుంటుంది. కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం.   
► 2020 ఖరీఫ్‌ పంట కోతలు వచ్చే ఏడాది జనవరిలో పూర్తి అయితే, పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఫిబ్రవరిలో నివేదిక తీసుకుని.. మార్చి, ఏప్రిల్‌లోనే బీమా పరిహారం ఇస్తాం. ఆ డబ్బు వారికి వచ్చే ఖరీఫ్‌కు ఉపయోగపడుతుంది. రంగు వెలిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇది చరిత్రలో తొలిసారి. గ్రేడెడ్‌ ఎమ్మెస్పీ ఇచ్చి ఆ కార్యక్రమం అమలు చేస్తాం. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, సి.వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. 

మీరే మా ధైర్యం
భారీ వర్షాలు వచ్చినా, బీమా సొమ్ము అందుతుందని ధీమాగా ఉన్నాం. మేము అడగక ముందే మీరు అన్నీ ఇచ్చేస్తున్నారు. నాకు, మా అమ్మకు, చెల్లికి పంటల బీమా కింద రూ.1 లక్షా 69 వేలు అందింది. గతంలో పరిహారం వస్తుందో రాదో తెలీదు. వచ్చినా అరకొరే. మీ హయాంలో వ్యవసాయం పండగలా ఉంది. మీరే మా ధైర్యం. ఆర్బీకేల వల్ల ఎంతో ఉపయోగం ఉంటోంది. మా మండలానికి రూ.5 కోట్ల 26 లక్షల బీమా సొమ్ము వచ్చింది. జిల్లాలో ఇదే అత్యధికం.   
 – కె.వీరరాజు, పెదపూడి, తూర్పు గోదావరి 

మీరు చల్లగా ఉండాలి
నాకు పంట నష్టం కింద రూ.7 వేలు వచ్చింది. ఇది వరకు విత్తనాల కోసం అనంతపురానికి రెండు, మూడు రోజులు తిరగాల్సి వచ్చేది. మీ పుణ్యమా అని మాకు ఆ బాధ తప్పింది. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు మీరు మాకు అండగా నిలుస్తున్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా కానుక, పింఛన్లు.. ఇలా అన్నీ అందుతున్నాయి. మీరు చల్లగా ఉండాలి. మా కరువు జిల్లాను గుర్తించి కొత్తగా మూడు రిజర్వాయర్లు కడుతున్నందుకు ధన్యవాదాలు. 
– వెంకటలక్ష్మి, నర్సినీకుంట, రాప్తాడు మండలం, అనంతపురం 

రైతును నిలబెట్టిన ఏకైక సీఎం మీరే
రైతు దేశానికి వెన్నెముక అని చాలా మంది పోసుకోలు కబుర్లు చెప్తారు. వరుస కరువులు, అతివృష్టి వల్ల  రైతు వెన్నెముక వంగిపోయే పరిస్థితుల్లో.. మీరు రైతు వెన్నెముకను నిటారుగా నిలబెట్టారు. ఇలా చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి మీరే. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడు. నాకు నాలుగూ ముక్కాలెకరా పొలం ఉంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.8 వేల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, నేను కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్టాను. ఇప్పుడు నాకు రూ.40 వేల పరిహారం వచ్చింది. వర్షాలకు పంట నష్టపోతే నెలకే పరిహారం ఇచ్చిన ఘనత మీదే.      
– తిరుమలరెడ్డి, వీఎన్‌ పల్లి, వైఎస్సార్‌ కడప 

అందరి గుండెల్లో చిరస్థాయిగా..
నేను దళిత రైతుని. నాలుగెకరాల పొలంలో సాగు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్‌ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చాక రైతు కేవలం ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించేలా మీరు నిర్ణయం తీసుకున్నారు. మా మండలంలో 4,700 మంది రైతులకు రూ.4 కోట్ల 90 లక్షలు ఇన్సూరెన్స్‌ వచ్చింది. నాకు రూ.4,065 వచ్చింది. రైతులందరి తరఫున మీకు ధన్యవాదములు. మీరు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిల్చిపోతారు.     
    – అడిపి సుందరకుమార్, యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా 

మరిన్ని వార్తలు