పోలీస్‌ శాఖలో ఏటా 6,500 ఉద్యోగాల భర్తీ

22 Oct, 2020 03:28 IST|Sakshi

నాలుగేళ్ల పాటు నియామకాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ,శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత

బడుగు, బలహీన వర్గాలపై కుల పరమైన దాడులను ఉపేక్షించొద్దు

మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ బిల్లు, పోలీసు స్టేషన్లు

మన ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేది టాప్‌మోస్ట్‌ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. హింసకు కారకులైన వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు. ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల రక్షణ.. మొత్తం మీద పౌరులందరి రక్షణ, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దు. బడుగు, బలహీన వర్గాల వారి మీద కుల పరమైన దాడులు, హింస జరుగుతుంటే వాటికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తులను, సంఘ విద్రోహ కార్యకలాపాలను అణిచి వేయండి. ఈ విషయంలో పెద్ద, చిన్న అంటూ చూడొద్దని గతంలోనే చెప్పాను. మరోసారి కూడా స్పష్టం చేస్తున్నా.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో నాలుగేళ్ల పాటు ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. పోలీసు సంక్షేమ నిధికి మూడేళ్లుగా ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులపై ముద్రించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని మాట ఇస్తున్నా. అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం 
– పోలీసు శాఖలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్‌ దృష్ట్యా అదనంగా కావాల్సిన సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫై చేసి జనవరి నుంచి షెడ్యూల్‌ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరాం. నాలుగు దశల్లో ప్రతి ఏటా 6,500 పోస్టులను భర్తీ చేస్తాం.
– దేశంలోనే మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం మనదే. ఆ దిశగా సంకేతాలు ఇచ్చేందుకు మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో నా సోదరి సుచరితమ్మను హోం మంత్రిగా చేశాం.
– రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద పోలీసులు ఉక్కుపాదం మోపాలి. లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన వంటి వాటి మీద పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి.

పోలీసుల కష్టం నాకు తెలుసు 
– కోవిడ్‌ సమయంలో గ్రామ, వార్డు సచివాలయాలు మొదలు పోలీసులు, రాష్ట్ర డీజీపీ వరకు విధి నిర్వహణలో బాగా పని చేశారు. ఈ సందర్భంగా అసువులు బాసిన వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాను.
– నిరంతరం ప్రజల్లో ఉండే పోలీసులు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఇసుక, మద్యం దొంగదారి పడుతుంటే చట్టం అమలు చేయడానికి పోలీసులు అదనంగా శ్రమిస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు.

నేరాల సంఖ్య తగ్గించేందుకు నిరంతరం కృషి 
– నేరాల సంఖ్య తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక దేశం అభివృద్ధికి సూచిక తలసరి ఆదాయం. కానీ దానికి మించిన ఇండికేటర్‌ రాష్ట్రంలో నేరాల సంఖ్య తక్కువగా ఉండటం.
– ఫిన్‌ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయి. మానవ అభివృద్ధికి నేరాల రేటు తక్కువగా ఉండడం కూడా ఒక ప్రమాణం. అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితి రాత్రికి రాత్రి వస్తుందని అనుకోవడం లేదు. 
అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం సెల్యూట్‌ చేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో సీఎస్‌ నీలం సాహ్ని, హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్‌   

‘దిశ’ బిల్లుకు త్వరలో ఆమోదం వస్తుందని ఆశిస్తున్నా 
– దిశ బిల్లు తీసుకు రావడం నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. వాటిలో ఎక్కువగా మహిళలనే నియమించాం. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం అడుగులు వేస్తున్నాం. 
– దిశ బిల్లును కేంద్ర ప్రభుత్వ పరిశీలకు పంపించామని అందరికీ తెలుసు. త్వరలో ఆమోదం వస్తుందని ఆశిస్తున్నాం. 
– ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, సీఎస్‌ నీలం సాహ్ని,  పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నమ్మకానికి నిదర్శనం
పోలీసుల క్యాప్‌పై నాలుగు సింహాలు ఉంటాయి. నాలుగు వైపుల నుంచి ఏ ఆపద వచ్చినా కాపాడతారన్న నమ్మకానికి అవి నిదర్శనం. సారనాథ్‌ స్థూపం నుంచి తీసుకున్న ధర్మచక్రం, దాని కింద ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యం.. అధికారం అనేది ఎంతటి బాధ్యతో చెబుతుంది. 61 ఏళ్లుగా పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజు పోలీసు అమర వీరులను దేశం యావత్తూ స్మరించుకునే రోజు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు, ఆ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుంది.

అమరవీరుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం 
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. మహిళా, బాలికా సంక్షమంతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి వారి సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చాం. సైబర్‌ నేరాల పట్ల బాలికలకు అవగాహన కల్పించాం. పోలీస్‌ సేవా యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం.
– మేకతోటి సుచరిత, హోం మంత్రి  

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం
విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనాతో మృతి చెందిన పోలీసులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.50 లక్షలు ప్రకటించారు. హోంగార్డుల జీతాల పెంచారు.  టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.
– గౌతమ్‌ సవాంగ్, డీజీపీ 

మరిన్ని వార్తలు