Andhra Pradesh : మిషన్‌ ‘క్లీన్‌’

21 Jun, 2022 02:17 IST|Sakshi

పారిశుధ్య కార్మికుల సేవలు భేష్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

వారిలా మరెవరూ చేయలేరు

చంద్రబాబు హయాంలో తీవ్ర వివక్ష.. మన ప్రభుత్వం వచ్చాక వేతనాలు 80% పెంపు

మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి.. కృష్ణా, గోదావరి కలుషితం కాకుండా చర్యలు 

శుద్ధి తర్వాతే నదుల్లోకి వ్యర్థ జలాలు

విజయవాడలో కాలువల సుందరీకరణపై నివేదిక 

పంట కాలువల్లో చెత్త పారేయకుండా జాగ్రత్తలు

వచ్చే నెలలో మరిన్ని మహిళా మార్టులు.. ఇక ఆహ్లాదకరంగా ఎయిర్‌పోర్టు రోడ్లు

జూలై 15 నాటికి రోడ్లకు మరమ్మతులు పూర్తి.. 20కి ఫొటోలతో గ్యాలరీలు

గడువులోగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షించిన సీఎం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ పట్టణాలు, నగరాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నదీ జలాలు కలుషితం కాకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. విజయవాడలో పంట కాలువల్లో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పారవేయకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల్లో పనుల పురోగతిపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు.

పట్టణాల్లో పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరెవరూ చేయలేరని సీఎం పేర్కొన్నారు. 2015 నుంచి 2018 సెప్టెంబర్‌ వరకు చంద్రబాబు హయాంలో మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది వేతనాలు కేవలం రూ.10 వేలు మాత్రమే ఉండేవన్నారు. ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు మాత్రమే రూ.12 వేలు చేశారన్నారు. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో పారిశుధ్య కార్మికులకు ఇచ్చింది నెలకు రూ.10 వేలు మాత్రమేనన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారిని..,వారి సేవలను గుర్తిస్తూ వేతనాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పారిశుధ్య కార్మికుల వేతనాలను 80 శాతం పెంచినట్లైందని సీఎం తెలిపారు. 

రూ.వేల కోట్లతో టిడ్కో ఇళ్లకు సదుపాయాలు
పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు.

మరో రూ.6 వేల కోట్ల ఖర్చుతో పనులు చేపట్టామని తెలిపారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే పేదలకు అందించిందన్నారు. ఇక 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి గత సర్కారు లబ్ధిదారుడి వాటాగా పెనుభారం మోపగా ఇప్పుడు వారికి కూడా ఉపశమనం కలిగిస్తూ 50 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తున్నట్లు చెప్పారు. 

పట్టణ రోడ్లకు మెరుగులు
నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో 16,762 రహదారులకు సంబంధించి 4,396.65 కి.మీ మేర రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇందుకోసం రూ.1,826.22 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. పనుల ప్రగతిని ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తి చేశామని, రోడ్లపై గుంతలు పూడ్చివేతను ముమ్మరంగా చేపట్టామని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 51.92 శాతం గుంతల పూడ్చివేత పనులు పూర్తయ్యాయని, జూలై 15 నాటికల్లా మొత్తం పూర్తి చేస్తామని వెల్లడించారు. జూలై 20 నాటికి మునిసిపాలిటీల్లో రోడ్ల పరిస్థితిని తెలియచేస్తూ నాడు – నేడు ద్వారా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 

మరింత సుందరంగా ఎయిర్‌పోర్టు రోడ్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. ఎయిర్‌ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గన్నవరం – విజయవాడ, భోగాపురం –  విశాఖ వెళ్లే రహదారుల్లో మార్పు స్పష్టంగా కనిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు నగరాల అందాలను మెరుగుపరిచేలా ఉండాలన్నారు.

రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. విజయవాడలోని రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు ఉన్న రోడ్డును ఇటీవల ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసింది. ఆయా ప్రాంతాల్లో నాటే మొక్కలపై గ్రీనింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు సీఎంకు వివరించారు.  

నియోజకవర్గానికో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ 
నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్మార్ట్‌ టౌన్‌షిప్‌ తప్పనిసరిగా ప్రారంభం కావాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మరిన్ని మహిళా మార్టులు..
మెప్మా ఆధ్వర్యంలో ఆరు పట్టణాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటైన జగనన్న మహిళా మార్టుల పనితీరుపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఇవి విజయవంతమయ్యాయని, జూలైలో కొత్తగా మరిన్ని మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సుందర విజయవాడ..
విజయవాడలో కాలువల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ముఖ్యంగా పంట కాలువల్లో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పారవేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించాలన్నారు. నగరంలో చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేసి పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా కరకట్ట రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులోని నాలుగు గ్యాప్‌లను పూర్తిచేసే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌శర్మ, పురపాలక, పట్ణణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

పరిశుభ్ర కృష్ణా, గోదావరి..
మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి ప్రాజెక్టును సమర్థంగా నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాలుష్యాన్ని అరికట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛాంధ్రతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు భాగస్వామ్యం కావాలన్నారు.

పట్టణ, నగర ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటితో కృష్ణా, గోదావరి నదులు, పంట కాలువలు కలుషితం అవుతున్నాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. శుద్ధి చేసిన తరువాతే నదులు, కాలువల్లోకి వదిలేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కోసం ఇప్పటిదాకా చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.  

మరిన్ని వార్తలు