Spandana Program: పొరపాట్లను స్పందనతో సరిదిద్దుకునే అవకాశం

2 Jun, 2022 04:28 IST|Sakshi

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌

అధికారులు లేకుంటే నాణ్యత ఉండదు

క్షేత్రస్థాయి విచారణ ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి

ఈ సమయంలో ఫిర్యాదుదారు కచ్చితంగా ఉండాలి

ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి

సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో దొర్లే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కార్యక్రమం కల్పిస్తోందని, స్పందన అర్జీల పరిష్కారంపై అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఉన్నతాధికారులతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అర్జీల పరిష్కారం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం  దిశా నిర్దేశం చేశారు.

స్పందనను మనమే స్వచ్ఛందంగా చేపడుతున్నామని గుర్తు చేస్తూ సమస్యలను పరిష్కరించాలన్న తపన ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులంతా మన ఎస్‌డీజీ సూచికల వైపే చూస్తున్నారని ప్రస్తావిస్తూ మన కలెక్టర్లు దేశంలోనే అత్యుత్తమమని గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

తనిఖీల ఫొటోల అప్‌లోడ్‌ 
రోజూ సచివాలయాల పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమాన్ని చేపట్టాలి. జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో స్పందన ప్రతి సోమవారం నిర్వహించాలి. ఈ సమయంలో సంబంధిత అధికారులు కచ్చితంగా ఉండాలి. సంబంధిత అధికారులు స్పందన సమయంలో ఉంటున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేస్తాం. స్పందన సమయంలో అధికారులు లేకుంటే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండదు.

స్పందన పోర్టల్‌లో దీనిపై మార్పులు చేర్పులు చేస్తున్నాం. అర్జీలపై క్షేత్రస్థాయిలో జరిపే విచారణలు, తనిఖీలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ సమయంలో ఫిర్యాదుదారు కచ్చితంగా ఉండాలి. అర్జీపై అధికారులు ఫిర్యాదుదారుతో కలసి ఫీల్డ్‌ ఎంక్వైయిరీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తన సమస్యను పట్టించుకున్నారన్న తృప్తి అర్జీదారుకి ఉంటుంది. పౌర సమస్యలకు సంబంధించి ఫీల్డ్‌ ఎంక్వైరీ ఫొటోలే కాకుండా సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి.

సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి
గడప గడపకూ.. కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే నెలలో 10 సచివాలయాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలనూ తెలుసుకుంటారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి సమస్యలు తెలుసుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని తెలియజేస్తారు. ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.

మీ పనితీరే.. నా పనితీరు, మనందరి పనితీరు
మహిళా, శిశు సంక్షేమాన్ని తీసుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం. గతంలో రూ.500 – రూ.600 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మనం రూ.1800 – రూ.1900 కోట్లు వెచ్చిస్తున్నాం. దీన్ని సమర్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న పనులను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో పారదర్శకంగా రూ.1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం.

ఈ స్థాయిలో డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు. ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా ఎలాంటి వివక్షకు తావులేకుండా అందించాం. జాతీయ స్థాయిలో ప్రత్యేక ముద్ర వేయగలిగాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులంతా మన ఎస్‌డీజీ సూచికల వైపే చూస్తున్నారు. వీటన్నింటితో మన కలెక్టర్లు దేశంలోనే ఉత్తమమని గుర్తింపు పొందాలి. మీరే నా కళ్లూ, చెవులు. మీ పనితీరే .. నా పనితీరు, మనందరి పనితీరు.

మరింత సమర్థంగా..
స్పందన చాలా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం. దీన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి సీఎస్‌ ఇప్పటికే జీవో ద్వారా మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధన చాలా ముఖ్యమైన అంశం. స్పందన, ఎస్‌డీజీల ఆధారంగా మీ పనితీరు మదింపు ఉంటుంది. 

మరిన్ని వార్తలు