చదువే విద్యార్థులకు ఒక శక్తి.. 

8 Oct, 2020 12:45 IST|Sakshi

 'జగనన్న విద్యాకానుక' ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. ‘‘పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారు. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌పై గత ప్రభుత్వం ఆలోచించలేదు. ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని’’ సీఎం పేర్కొన్నారు. (చదవండి: ‘విద్యా కానుక’.. తల్లిదండ్రుల వేడుక)

‘‘పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం. పేద పిల్లలు గొప్పగా చదవాలని భావించాను. ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నాం. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తాం. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నాం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలి. ప్రతి విద్యార్థి గొప్పగా చదవాలని ఆశిస్తున్నాం. పేదవాడి తలరాతలు మార్చాలని 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం. అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలను ప్రతి తల్లి అకౌంట్‌లో వేస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. (చదవండి: పేదల విద్యార్థులను ఆదుకునేలా ‘విద్యా కానుక’)

గర్భిణీ తల్లులు, బిడ్డల కోసం సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నామని, అంగన్‌వాడీలను చదువుల కేంద్రంగా మార్చామని సీఎం తెలిపారు. అంగన్‌వాడీలను వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. మధ్యాహ్న భోజనం ద్వారా ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్, మెడికల్ వంటి పెద్ద చదవుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్‌తో పాటు హాస్టల్ ఖర్చు కోసం వసతి దీవెన కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని చేపట్టాం. పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని సీఎం వైఎస్‌ జగన్ పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు