రైతు కోసం నిలబడ్డాం: సీఎం జగన్‌

19 Nov, 2021 14:46 IST|Sakshi

రాష్ట్రంలో వ్యవసాయం గిట్టుబాటయ్యేలా విప్లవాత్మక చర్యలు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఎన్నికల హామీలను వంద శాతం అమలు చేస్తున్నాం

హామీకి మించి రైతు భరోసా పథకం.. ఆర్బీకేలతో సమూల మార్పులు

ఈ–క్రాపింగ్‌తో అర్హులందరికీ లబ్ధి.. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు 

అన్ని పంటలకు మద్దతు ధర.. అమూల్‌తో పాడి రైతులకు భారీ లబ్ధి

భారీ వర్షాల బాధిత రైతులు, ప్రజలను ఆదుకుంటాం

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

సాక్షి, అమరావతి: ‘వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే ఎక్కువగా రైతులకు లబ్ధి కలిగిస్తున్నాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేశాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో శుక్రవారం వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎన్నో కీలక నిర్ణయాలు, విప్లవాత్మక మార్పులతో రైతులకు ప్రయోజనం కలిగిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బతికిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం బాగుంటేనే రైతు, రైతు కూలీలు బాగుంటారని, వీళ్లందరికీ పని దొరికితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బతుకుతుందన్నారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలు కళ్లారా చూసి, వారి సమస్యలు తీరుస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, ఆ మేరకు వంద శాతం వాగ్దానాలు నెరవేరుస్తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

ఈ–క్రాపింగ్‌ ద్వారా అన్ని విధాలా లబ్ధి
►చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. వాటన్నింటినీ మాఫీ చేస్తామని మాట ఇచ్చి.. మోసం చేశారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ అనే పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టింది. రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టింది. 
►మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము రూ.1,674 కోట్లు. బకాయిలను కూడా చెల్లించింది.   
►ఈ–క్రాపింగ్‌ ద్వారా అర్హులైన రైతులందరూ అన్ని విధాలా లబ్ధిపొందేలా చర్యలు తీసుకున్నాం. సున్నా వడ్డీ పథకం నమోదు చేస్తున్నాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం. పంట నష్టపోతే ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే ఇస్తున్నాం. రూ.3,788 కోట్లు బీమా సొమ్ము ఇచ్చాం. 
►ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,070 కోట్లు పైగా ఇచ్చాం. రైతన్నలకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు రూ.18,000 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్లు అప్‌గ్రేడ్‌ చేయటానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
►ఆక్వా రైతులను ఆదుకునేలా యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తూ ఏడాదికి రూ.780 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.1,520 కోట్లు ఆక్వా రైతులకు ఇచ్చాం. 
ఆర్బీకేల ద్వారా చేయూత
►10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటున్నాం. రూ. 2,134 కోట్లు వ్యయం చేస్తూ ఆర్బీకేల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా తక్కువ ధరకే అద్దెకు సాగు పనిముట్లు అందుబాటులో ఉంచాం. 
►ధాన్యం సేకరణకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేశాం. ఏటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు, రూ.9000 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల్ని చిరునవ్వుతో మన ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తున్నాం. పొగాకు, పామాయిల్‌ రైతులనూ ఆదుకున్నాం. 
►మార్కెట్‌ యార్డుల్లో కూడా నాడు–నేడు కార్యక్రమం చేపట్టాం. గోడౌన్లు, కోల్డ్‌ రూమ్స్, ప్రైమరీ ప్రాసెసింగ్, డ్రయింగ్‌ ఫ్లాట్‌ఫాంలు, అస్సేయింగ్‌ ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. 
►రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేశాం. ఆర్బీకేల పరిధిలో, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటయ్యాయి. తద్వారా రైతాంగ సమస్యలు సత్వర పరిష్కారానికి మార్గం చూపాం. కరోనా సమయంలోనూ బాధ్యతతో అడుగులు వేశాం. 
►అమూల్‌ ద్వారా రాష్ట్రంలో ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా వస్తోంది. తద్వారా మిగతా డెయిరీలన్నీ ఎక్కువ రేటు ఇవ్వాల్సి వస్తోంది. 

చెప్పిన మాట కంటే మిన్నగా రైతు భరోసా
►ఈ రెండున్నరేళ్లలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికి రూ.18,777 కోట్లు అందించాం.  అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులు, దేవదాయ భూముల సాగుదారులకు కూడా రైతు భరోసా పథకం అందించాం. 
►ఎన్నికలప్పుడు ఏటా రూ.12,500 చొప్పున నాలుగు ఏళ్లు ఇస్తామని చెప్పాం. కానీ ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా అందిస్తున్నాం. అదీ ఐదేళ్లు ఇస్తున్నాం. 

సాక్షి, అమరావతి: రాజన్న బిడ్డ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా సుభిక్షంగా మారిపోయిందని, అత్యంత కరువు జిల్లాగా ముద్ర పడిన అనంతపురంలో ప్రతి ఏటా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో ‘వ్యవసాయ రంగం –రైతుల సంక్షేమం’ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ‘చంద్రబాబు– కరువు.. కవలపిల్లలు’ అని నానుడి ఉండిందని, చంద్రబాబు దిగిపోగానే కరువు కూడా పోయిందన్నారు. జగన్‌ ప్రభుత్వ చర్యలతో రైతులు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు మళ్లుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం రైతు చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
రెండు మూడు తరాలు ప్రభావం 
►వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించి రెండున్నరేళ్లలోనే రెండు మూడు తరాలు మర్చిపోలేని విధంగా మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. మనస్సున్న సీఎం ఉండడం వల్లే రెండున్నరేళ్లలో రూ.18,777 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయింది. 
►చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. అప్పట్లో పంటల బీమా పొందాలంటే ప్రీమియం కట్టాలి. కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. ఈ రోజు ఈ –క్రాప్‌ బుక్‌ చేసుకుంటే చాలు పంటల బీమా వర్తింప చేస్తున్నాం. 
►చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బాకీలు కట్టడానికే సగం ఆదాయం సరిపోతుంది. వాళ్ల అదృష్టం మీడియానే. ఆ ప్రభుత్వం గోరంత చేస్తే కొండంత చూపిస్తూ గడిపారు.  
►ఆరోగ్యశ్రీ, 108 పథకాల ద్వారా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిస్తే, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు, ఇతరత్రా చర్యల ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచారు. ఇవాళ దేశం అంతా మన రాష్ట్ర ప్రగతిని, వ్యవస్థను ప్రశంసిస్తోంది. 
►రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది రైతులు సలహా మండళ్లలో పని చేస్తున్నారు. 108 తరహాలోనే పశువులకు సకాలంలో వైద్యం అందించేందుకు మొబైల్‌ అంబులెన్స్‌లను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి తీసుకొస్తాం.

ప్రజలు కొట్టిన దెబ్బకు చంద్రబాబు మైండ్‌ బ్లాంక్‌
పంచాయతీ, మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం వల్లే సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.   కుప్పం మునిసిపాల్టీలో ప్రజలు టీడీపీని చావుదెబ్బ తీయడంతో బాబు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు.. సభలో రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం రైతులు బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదని చెప్పారు. సీఎంగానే సభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబును.. తాను కదా సీఎం కావాల్సిందని చొక్కా పట్టుకుని లోకేష్‌ అడిగే పరిస్థితిని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

చదవండి:
 మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్‌ 

 అసెంబ్లీలో టీడీపీ హైడ్రామా.. కన్నీళ్లు, వాకౌట్‌ అంటూ పచ్చ మీడియా అతి

మరిన్ని వార్తలు