గత పాలకులు బద్వేలును పట్టించుకోలేదు: సీఎం జగన్‌

9 Jul, 2021 13:03 IST|Sakshi

రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు

కుందూ నదిపై లిఫ్ట్‌ ద్వారా బ్రహ్మసాగర్‌కు నీళ్లు అందిస్తాం

రూ.80 కోట్లతో లోయర్‌ సగిలేరు కాల్వల విస్తరణ

బద్వేలు బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్రంలోనే వెనుకబాటులో ఉన్న నియోజకవర్గం బద్వేలు అని.. గత పాలకులు ఎప్పుడూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బద్వేలులో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడూ నిండుకుండలా ఉండాలన్నారు. కుందూ నదిపై లిఫ్ట్‌ ద్వారా బ్రహ్మసాగర్‌కు నీళ్లు అందిస్తామని తెలిపారు.

బద్వేలులో కూరగాయలు, చేపల మార్కెట్లు‌, వాణిజ్య సముదాయాలు ఏర్పాటుతో పాటు రూ.80 కోట్లతో లోయర్‌ సగిలేరు కాల్వల విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. రూ.56 కోట్లతో తెలుగు గంగ పెండింగ్‌ పనులతో పాటు, రూ.36 కోట్లతో బ్రహ్మసాగర్‌ ఎడమ కాల్వలో 3 ఎత్తిపోతలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రాహ్మణపల్లి వద్ద సగిలేరుపై రూ.9.5 కోట్లతో మరో వంతెన నిర్మిస్తామన్నారు. రూ.7.5 కోట్లతో గోదాముల నిర్మాణంతో పాటు బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

నీటి లీకేజీ లేకుండా..:
మరోవైపున బహ్మంసాగర్‌ ప్రాజెక్టు గట్టుకు ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ కటాఫ్‌ వాల్‌ నిర్మాణం పనులు రూ.45 కోట్లతో ఇవాళ మొదలు పెడుతున్నాం. ఎందుకుంటే నిండు కుండలా జలాశయం నిండితే లీకేజీలు కనిపించాయి. కాబట్టి ఈ మరమ్మతులు చేపట్టాం. దీని వల్ల ప్రాజెక్టులో మొత్తం 17 టీఎంసీలు ఎప్పుడూ నింపుకోవచ్చు. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను.

పెరగనున్న ఆయకట్టు:
ఇంకా రూ.36 కోట్లతో బ్రహ్మంసాగర్‌ జలాశయం ఎడమ కాలువలో మూడు ఎత్తిపోతల పథకాలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. దీని వల్ల అక్షరాలా 8,268 క్యూబిక్‌ లీటర్ల నీటిని, సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల, గంగనపల్లి చెరువులను పూర్తిగా నింపడంతో పాటు, కాశినాయన మండలంలో సుమారు 3500 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చు. ఈ మంచి కార్యక్రమానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా:
 రూ.10 కోట్లతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం 5 సబ్‌ స్టేషన్ల నిర్మాణం. ఇది ఇక్కడి వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుంది. విద్యుత్‌ సరఫరాలో నాణ్యత చాలా పెరుగుతుంది.

రహదారుల విస్తరణ–రవాణా సదుపాయం:
 పోరుమామిళ్ల పట్టణంలో 3.6 కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లకు రూ.25 కోట్లతో విస్తరణ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. దీని వల్ల పోరుమామిళ్ల చక్కగా మారుతుంది. మరో రూ.22 కోట్లతో సగిలేరు నది మీద వేములూరు గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన. దీని వల్ల 30 గ్రామాల ప్రజలకు రవాణ సదుపాయం కలుగుతుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో సగిలేరు నది మీద రూ.9.5 కోట్లతో వంతన  నిర్మాణం పనులు ఇవాళ మొదలు. కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు, ప్రకాశం జిల్లాకు రాకపోకలు మెరుగవుతాయి.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

గోదాముల నిర్మాణం:
బద్వేలు మార్కెట్‌ యార్డులో రైతుల కోసం 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఒక గోదాము, పోరుమామిళ్లలోని మార్కెట్‌ యార్డులో కూడా 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రూ.7.5 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం.

ఆలయాల అభివృద్ధి:
బద్వేలులో శ్రీ ప్రసన్న వెంటటేశ్వర ఆలయం, శ్రీ ఆదికేశవ దేవాలయంతో పాటు, కాశినాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.4.7 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశాం.

బద్వేలులో ఆర్డీఓ ఆఫీస్‌:
ఇక్కడ ఎప్పటినుంచో ఒక డిమాండ్‌. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం కావాలని అడుగుతున్నారు. ఆ ఆఫీస్‌ కోసం కాశినాయన, కలసపాడు మండలాల వారు ఎంతో దూరంలో ఉన్న రాజంపేటకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అక్కడి వారు రాజంపేటకు వెళ్లి రావడానికి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి వస్తోందని, ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్‌ కావాలని కోరారు. అందుకే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్‌ను మంజూరు చేస్తున్నానని తెలియజేస్తున్నాను.

అవన్నీ శాంక్షన్‌ చేస్తున్నాను:
ఇంకా రూ.34 కోట్ల విలువైన చిన్న చిన్న పనులను మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కోరారన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, అవన్నీ శాంక్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్‌ అండ్‌ బీ బంగ్లా మరమ్మతులు. రూ.5 కోట్లు. పంచాయతీ రాజ్‌ రోడ్ల మరమ్మతులతో పాటు, శిధిలావస్థలో ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు రూ.15 కోట్లు. బద్వేలు మండలంలో వీరబల్లి, కొత్తచెరువు ఎత్తిపోతల పథకం కోసం రూ.50 లక్షలు. బద్వేలు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌. 

ఎంత చేసినా తక్కువే:
ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ నా మీద ఎంతో ఆదరణ చూపారు. తమ బిడ్డలా ఆప్యాయత చూపారు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నాను.

మరిన్ని వార్తలు