గతంలో హడావుడి ఎక్కువ.. పని తక్కువ: సీఎం జగన్‌

3 Sep, 2021 13:19 IST|Sakshi

రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం

పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలన్నీ అమలు చేస్తున్నాం. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతపడతాయి. 25 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు’ అని సీఎం అన్నారు. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు, అదే రకంగా స్పిన్నింగ్‌ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంస్‌ఎంఈలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్నారని మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని సీఎం అన్నారు.

అక్కడ ఏమీ జరక్కముందే..
‘‘ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం అంటే.. రాష్ట్రం ప్రభుత్వం ఒక మాట చెప్తే.. చేస్తుంది అని నమ్మకం కల్పించడం అంటే.. పరిశ్రమలను పెట్టడానికి విశ్వాసం కల్పించడమే. మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేవారుసహా వీరందరినీ కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడినట్టు అవుతుంది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా జీడీపీకి దోహదపడతాయి. గతంలో మాదిరిగా హడావిడి ఎక్కువగా ఉంటేది. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, కాగితాల మీద అగ్రిమెంట్లు పెట్టుకునేవారు, ఆ రోజుల్లో అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేసింది..  ఎయిర్‌బస్‌ వచ్చేసింది అని మరో రోజు, బుల్లెట్‌ రైలు వచ్చేసిందని మరో రోజు ఇలా హెడ్‌లైన్స్‌ పెట్టి రాసేవారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి అడుగులు ముందుకేస్తున్నాం.

మన కళ్లముందే కనిపిస్తున్నాయి..
పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మన కళ్లముందే కనిపిస్తున్నాయి. పరిశ్రమలు రావాలంటే... దానికి అనుకూల వాతావరణం ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్‌ అనేదాన్ని చెప్తే.. దాన్ని ఇచ్చేలా ఉండాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులను చూస్తే... ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది.

అనుకూలతలేని పరిస్థితులనుంచి కూడా ప్రజలను కాపాడుకోవాలి, ఒక వేళ డిమాండ్‌ తగ్గకుండా చూసుకుంటూ, మరోవైపు పరిశ్రమలను నిలబెట్టే కార్యక్రమాలు చేయాలి. ఇదే దిశగానే అడుగులు వేస్తూనే ముందుకు పోవడం జరుగుతుంది. పరిశ్రమలు రావడమే కాదు, కొనుగోలు శక్తి ప్రజలకు ఉన్నప్పుడే ఆ పరిశ్రమలు నిలబెడతాయి. అది లేకపోతే.. ఆ సైకిల్‌ దెబ్బతింటుంది, పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి, మూతబడే పరిస్థితి ఉంటుంది. కోవిడ్‌ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే దాదాపు 22 సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకు వచ్చాం.

దాన్ని కూడా నెగెటివ్‌గా చూపిస్తున్నారు..
ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా వివక్షకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతి పేద లబ్ధిదారునికి డీబీటీ పద్ధతిలో వారి అక్కౌంట్లోకి వేస్తున్నాం. ఈ 27 నెలలకాలంలో మన  ఇచ్చిన డబ్బు కుటీర, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టగలిగాయి, అంతేకాకుండా ఉపాధిని నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రజల కొనుగోలు శక్తి నిలబెట్టగలిగాం.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మైనస్‌ 5శాతం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా మన రైతును, మన వెనకబడ్డ వారిని నిలబెట్టుకోగలిగాం. గ్రోత్‌రేట్‌ చిన్నదే అయినా నిలబెట్టుకోగలిగాం. అప్పోసప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు చెప్పినమాట. కాని దురదృష్టవశాత్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటివాళ్లు, తెలుగు దేశం పార్టీవాళ్లు..... ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసే కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా నెగెటివ్‌గా చూపించే అధ్వాన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.

పండే చెట్టుమీదే రాళ్లు పడతాయి...
వీళ్లు ఎలాంటి నెగెటివ్‌ కార్యక్రమాలు చేసినా.. దేవుడి దయతో మంచి చేయాలనుకున్న కార్యక్రమాలను చేస్తాం. పరిశ్రమలు, వాటిమీద ఆధారపడ్డ కుటుంబాలకు మరింత చేయూతనిస్తున్నాం. 12 లక్షలమందికి ఉపాధినిస్తున్న పరిశ్రమలకు చేయూతనిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌మిల్స్‌కు రూ.684 కోట్లు నేరుగా వారి అక్కౌంట్లోకి వెళ్తాయి. 27 నెలలకాలంలోనే ఇప్పటివరకూ ఈ రంగాలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.2,087 కోట్లు ఆసరా, చేయూత, తోడు లాంటి కార్యక్రమాలు కాకుండా ఇవి అదనంగా ఇచ్చాం.

గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్‌ఎంఈలకు బకాయి పెట్టిన రూ.904 కోట్లు, సిన్నింగ్‌మిల్స్‌కు పెట్టిన రూ.684 కోట్లు మొత్తంగా రూ. 1,588కోట్ల బకాయిలను మన ప్రభుత్వం చెల్లిస్తోంది. లబ్దిపొందుతున్న యూనిట్లలో 62శాతం ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నారు. 42 శాతం యూనిట్లు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ప్రోత్సహకాలు ఇవ్వకపోతే వీళ్లు రోడ్డుమీద పడతారన్న ఆలోచన గత ప్రభుత్వం చేయలేకపోయింది. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ చట్టంచేసిన ప్రభుత్వం మనది. ఇవే కాకుండా పారిశ్రామికంగా అడుగులు ముందుకేస్తున్నాం.

వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో రూ.10వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి 801 ఎకరాల్లో రూ.730 కోట్లతో ఎలక్ట్రానిక్‌  మాన్యుఫ్యాక్చరింగ్‌యూనిట్లను రూపొందిస్తున్నాం. వచ్చే 2 ఏళ్లలోనే దాదాపు 30వేలమందికి ఉపాధి అవకాశాలు. వైఎస్సార్‌ నవోదయం కింద 1,08,292 ఎంఎస్‌ఎంఈ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రూపాయలకు పైగా రుణాలను రీషెడ్యూల్‌ చేశాం. 2,49,591 ఎంస్‌ఎంఈ బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హామీ పథకం కింద బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ను ఏర్పాటు చేశాం. మన ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీనిద్వారా 46,199 మందికి ఉపాధి లభించిందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఇవీ చదవండి:
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్‌ 
ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు

మరిన్ని వార్తలు