CM YS Jagan: రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో మేలు.. సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు

20 Jul, 2022 12:53 IST|Sakshi

సాక్షి, నెల్లూరు/ప్రకాశం: రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బుధవారం పోర్టు పూజా కార్యక్రమం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. 

రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది. ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.

పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం జగన్‌. పోర్టులో 75 శాతం స్థానికులే ఉద్యోగాలని మరోమారు వేదిక నుంచి స్పష్టం చేసిన సీఎం జగన్‌.. ఆ చట్టం తెచ్చిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులు కాకుండా మరో నాలుగు పోర్టులు తేబోతున్నామని, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు. త్వరలోనే మిగతా వాటికి భూమి పూజ చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. 

గత ప్రభుత్వానిది మోసమే!
ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా.. సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి టెంకాయ కొట్టి శంకుస్థాపన అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఇదెంత అన్యాయమని ప్రశ్నించారు సీఎం జగన్‌. ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టింది. భూ సేకరణ, డీపీఆర్‌ లేకుండానే శంకుస్థాపన హడావిడి చేసిందని, కానీ, తమ ప్రభుత్వం అన్ని క్లియరెన్స్‌లతో పక్కాగా ముందుకు సాగుతోందని..  ప్రజలు ఇది గమనించాలని సీఎం జగన్‌ కోరారు.

మరిన్ని వార్తలు