ఇకపై డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌: సీఎం జగన్‌

18 Jan, 2022 12:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇకపై డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు చెక్‌ పెడతామని.. దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని.. అన్ని గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు.

చదవండి: రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్‌ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు.

‘‘భూములకు సంబంధించి ట్యాంపరింగ్‌ జరుగుతోందన్న ఫిర్యాదులు  వచ్చాయి. పట్టాదారు పాస్‌ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్‌ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్‌ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఇస్తే ల్యాండ్‌ వివాదాలకు చెక్‌ పెట్టొచ్చు. 2023 కల్లా సమగ్ర రీ సర్వే చేసి యూనిక్‌ ఐడీ కార్డ్‌, డేటా అప్‌డేట్‌ ఇస్టాం. తొలి దశలో 51 గ్రామాల్లోని.. 29,563 ఎకరాల భూముల రీసర్వే చేశాం. ఎమ్మార్వోల ద్వారా భూ యజమానుల అభ్యంతరాలను పరిష్కారం చేశాం. ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు ఇస్తామని’’ సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు