ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్‌

1 Jan, 2022 12:40 IST|Sakshi

మంచి చేస్తుంటే విమర్శలా.. పేదల కష్టాలు వారికి తెలుసా..?

విమర్శించే వాళ్లకు అభివృద్ధి కనిపించడం లేదా?

అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు జిల్లా: మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపును శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామన్నారు. నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానన్నారు.

చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్‌ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం 

‘‘పెన్షన్‌ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా?. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. అత్యధిక  పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేది.

మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్‌ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్‌ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నాం. అర్హులందరికీ పెన్షన్‌ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నాం. పడిగాపులు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. లబ్ధిదారులకు ఇబ్బంది ఏర్పడితే వాలంటీర్లను కలవాలి. అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటీఎస్‌ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు