అవన్నీ కలిపితేనే మీ జగన్‌: సీఎం జగన్‌

15 Mar, 2023 16:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అని నిరూపించామని స్పష్టం చేశారు. అలాగే.. 

నాకు ఇండస్ట్రీ రంగం ఎంత ముఖ్యమో.. వ్యవసాయం అంతే ముఖ్యం. నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. అవ్వతాతలు కూడా అంతే ముఖ్యం. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమే. గత ప్రభుత్వానివి అన్నీ గాలి మాటలే. గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నానని స్పష్టం చేశారు. 

- నా నడక నేలమేద, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే..

- నా యుద్ధం.. పెత్తందార్లతోనే.. 

- నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే..

- ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌.. 

- ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ.. ఇవన్నీ కలిపితేనే మీ జగన్‌. 

‘పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా నాలుగేళ్ల పాలన సాగింది. మేనిఫెస్టోలో చెప్పిన 98.5 శాతం హామీలు అమలు చేశాం. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం. అందరికీ మంచి చేశాం. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నాం.  ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోంది. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి.

డీబీటీ ద్వారా రూ.1,97,473 కోట్లు లబ్ధిదారులకు అందించాం. గడప గడపకు వెళ్లి మేం చేసిన మంచిని చెప్తున్నాం. రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యాయి. సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుతున్నాయి. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ సేవలందిస్తున్నారు. 15004 గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. గ్రామ/వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. ‍ప్రతీ ఇంటికి 2.60 లక్షల మంది వాలంటీర్లు మంచి చేస్తున్నారు.

రైతన్నలకు అండగా ఆర్బీకేలు..
గ్రామస్థాయిలో తీసుకొచ్చిన గొప్ప మార్పు ఆర్బీకేలు. దేశంలోనే తొలిసారిగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ఇంత మంది అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్లు రైతన్నలకు తోడుగా ఉన్నారు.  విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నకు తోడుగా ఆర్బీకేలున్నాయి. రైతన్నలను చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ గ్రామస్థాయిలోనే ఉంది.  10,185 మంది సర్వేయర్లు గ్రామస్థాయిలో సేవలందిస్తున్నారు. కబ్జాలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పలికేలా అడుగులు వేస్తున్నాం. పౌర సేవల్లో ఇది గొప్ప విప్లవం. వ్యవసాయానికి పగటిపూటే ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 45 నెలల పాలనలో సీఎం జగన్‌ మార్క్‌ స్పష్టం కనిపిస్తోంది. గ్రామస్థాయిలో గొప్ప అభివృద్ధిని చూపించగలిగాం. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఫస్ట్‌ ప్లేస్‌..
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచాం. రాష్ట్రంలోని 6 పోర్టులు కాకుండా మరో 4 పోర్టులకు పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో తిరుగులేని మార్పునకు శ్రీకారం చుట్టాం. గతంలో లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. 2021-22 మధ్య 11.2శాతం ఆర్థిక వృద్ధి రేటుతో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 14.02శాతానికి తలసరి ఆదాయం పెరిగింది. మన ప్రభుత్వంలో 64లక్షల మంది పెన్షన్‌ అందుకుంటున్నారు. మన ప్రభుత్వంలోనే పెన్షన్‌ను రూ.2750కు తీసుకెళ్లాం. వచ్చే జనవరి నుంచి 3వేల రూపాయల పెన్షన్‌ తీసుకుంటారు. 

రోల్‌ మోడల్‌ స్టేట్‌గా ఏపీ..
ఏపీ రోల్‌ మోడల్‌ స్టేట్‌గా మారింది. రేషన్‌ను నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే వ్యవస్థ దేశంలో ఎక్కడైనా ఉందా?. డెలివరీ వాహనాల ద్వారా నాణ్యమైన రేషన్‌ సరుకులు ఇస్తున్నాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ క్లాసులు రాబోతున్నాయి. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ క్లాసులు ఉంటాయి. జూన్‌ నాటికి ప్రభుత్వ స్కూల్స్‌లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు వస్తాయి. కార్పొరేట్‌ బడులు ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా మార్పు తెచ్చాం. ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వ బడుల్లో మార్పులు తీసుకువచ్చాం. నాడు-నేడు కింద 40వేల ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మార్పులు తెచ్చాము. ట్యాబ్‌ల విషయంలో ప్రైవేటు స్కూల్స్‌ సైతం పోటీకి రావచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులతో ప్రైవేటు పాఠశాలలు పోటీ పడతాయి. 

ఐటీసీ, రిలయన్స్‌, అమూల్‌ వంటి పెద్దపెద్ద సంస్థల్ని తీసుకొచ్చాం. సున్నా వడ్డీతో అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నాం. మన ప్రభుత్వంలో 99.5 శాతం అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో పొదుపు సంఘాలను దెబ్బతీయడం చూశాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు రూ.25వేల కోట్లు  అందజేశామన్నారు. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 11.2 శాతం వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆర్థిక నిపుణులే అధ్యయం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉంది. వైఎస్సార్‌ నేతన్న హస్తం కింద 82వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని స్పష్టం చేశారు.

రైతు భరోసా కింద రైతన్నలకు రూ.27వేల కోట్లు అందించాం. రైతు బీమా భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,129 కోట్లు అందించాం. గతంలో గ్రామాల్లో మహిళా పోలీసులే ఉండేవారు కాదు. గ్రామ, వార్డు స్థాయిలో 15వేల మంది పోలీసులను నియమించాం. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచాం. ఎంఎస్‌ఎంలకు ప్రభుత్వం అండగా ఉంది. వ్యవసాయంపై 62శాతం జనాభా ఆధారపడి ఉంది. 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించాం. బలహీనవర్గాలకు తోడుగా నిలిచింది. మేం అధికారంలోకి వచ్చాక మరో 1.50లక్షల ఎంఎస్‌ఎంఈలు వచ్చాయి. దిశ యాప్‌తో దిశ బిల్లును కూడా తీసుకొచ్చాం. వైద్య రంగలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. గ్రామస్థాయిలో 10,500 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు