అంతు చిక్కని వ్యాధిగ్రస్తులకు సీఎం భరోసా

20 Mar, 2023 03:30 IST|Sakshi
అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల తండ్రితో మాట్లాడుతున్న సీఎం జగన్‌

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల వైద్యానికి సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. గాదే సురేష్, గాయత్రి దంపతుల పెద్ద కుమార్తె వేదశ్రీ దుర్గ(12), చిన్న కుమార్తె సాహితీ శ్రీ ప్రియ(8) పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించగా కంజెనిటల్‌ మేస్తేనిక్‌ సిండ్రోమ్‌–4సీగా వైద్యులు తేల్చారు.

ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేమని, మందుల ద్వారా కంట్రోల్‌ చేయవచ్చని చెప్పారు. పెయింటర్‌గా పనిచేస్తున్న సురేష్‌కు వైద్య ఖర్చులు భరించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ద్వారా వారు తిరువూరులో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. తక్షణ సాయంగా కలెక్టర్‌ వారికి రూ.లక్ష చెక్కును అందజేశారు.   

చిన్నారి కోలుకునే వరకు అండగా.. 
బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తమ కుమారుడు మారిపోగు రంజిత్‌(13)ను ఆదుకోవాలని తిరువూరు మండలం కొమ్మారెడ్డి పల్లెకు చెందిన మారిపోగు శ్రీను, వెంకట్రావమ్మ దంపతులు తిరువూరులో సీఎం వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. రంజిత్‌ కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. బాలుడి వైద్య ఖర్చులకు తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు రూ.లక్ష చెక్కు తల్లిదండ్రులకు అందజేశారు.    

మరిన్ని వార్తలు