సుస్థిర ప్రగతిలో హరిత విధానాలు

6 Apr, 2022 02:54 IST|Sakshi

వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తుల తయారీ

విశాఖలో పైలట్‌ ప్రాజెక్టు 

పరిశుభ్ర బీచ్, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం

మన్యంలో ఎకో టూరిజంతో పర్యాటకానికి ప్రోత్సాహం

కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములు సారవంతం

జీఏఎస్‌పీ ప్రతినిధులతో సీఎం జగన్‌ చర్చలు

సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. సుస్థిర ప్రగతిలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించేలా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయిన్‌బుల్‌ ప్లానెట్‌ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విస్తృతంగా చర్చించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్‌ ప్రాజెక్టు కింద విశాఖలో చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంతో అనుసంధానించి దీన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా బీచ్‌లను అత్యంత పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఇతర అంశాలపైనా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 

హరిత విధానాలకు పెద్దపీట
ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్‌పై అనుసరిస్తున్న వివిధ పద్ధతుల గురించి జీఏఎస్‌పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్, పార్లీ ఫర్‌ ది ఓషన్స్‌ ఫౌండర్‌ సైరిల్‌ గట్చ్‌ సమావేశంలో వివరించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమవుతున్న సముద్రాలను, భూగోళాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలతో వ్యర్థాల రీ సైక్లింగ్‌ చాలా కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 మిలియన్‌ టన్నుల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి అవుతుండగా కేవలం 9% మాత్రమే రీ సైక్లింగ్‌ జరుగుతున్నాయని, మిగతావన్నీ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారులు వేయవచ్చన్నారు. జీఏఎస్‌పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. బ్రాండింగ్‌ భవన నిర్మాణ మెటీరియల్, ఫర్నిచర్, వస్త్రాలు, బూట్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. 

మన్యంలో ఎకో టూరిజం
ఎకో టూరిజంపై ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను జీఏఎస్‌పీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో అరకు, అనంతగిరి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. స్థానికులకు మంచి ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళిక ఉండాలన్నారు. కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములను సారవంతంగా మార్చడంతోపాటు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెటింగ్‌ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.

విశాఖలో పైలట్‌ ప్రాజెక్టు 
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ కోసం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న వ్యర్థాల ప్రాసెసింగ్‌ విధానాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి జీఏఎస్‌పీ ప్రతినిధులకు వివరించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీకి విశాఖను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానించి విలువైన ఉత్పత్తుల తయారీని చేపట్టడంతోపాటు బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖలో పైలట్‌ ప్రాజెక్టు అనంతరం మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ తరహా విధానాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు