అంబేద్కర్‌కి నివాళులర్పించిన సీఎం జగన్‌

26 Nov, 2020 13:01 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విజయవాడ ప్రెస్ క్లబ్‌లో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 71వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా  జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పూలమూల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతంరెడ్డి, మాదిగ కార్పోరేషన్ చైర్మెన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూధనరావు, దళిత సంఘ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కాలే పుల్లారావు  మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దళితులు అణగదొక్కబడ్డారని, చంద్రబాబు దళితులను చిన్నచూపు చూశారని మండిపడ్డారు. అంబెద్కర్‌ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని, రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగుతోందని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్‌కు తాము ఎల్లప్పడూ అండగా ఉంటామని కాలే పుల్లారావు తెలిపారు.

మరిన్ని వార్తలు