నా ధైర్యం మీరే.. నా నమ్మకం మీరే.. నన్ను నడిపించేది మీరే

19 Mar, 2023 21:28 IST|Sakshi

తాడేపల్లి : దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా తన ధైర్యం, తన నమ్మకం ప్రజలేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరువూరు సభలో మాట్లాడిన కొన్ని అంశాలను మరొకసారి ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌.  ‘దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే… నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే… నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా.. మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా’ అని పేర్కొన్నారు.

కాగా, ఈరోజు(ఆదివారం) ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. దుష్టచతుష్టయం చేస్తున్న కుతంత్రాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి.

ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్‌ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ?  గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

ఇక్కడ చదవండి: ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్‌ 

మరిన్ని వార్తలు