సంక్షేమ పథకాలతో ఆదుకున్నాం

24 Sep, 2020 04:11 IST|Sakshi
ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

సమాజంపై కోవిడ్‌ సంక్షోభం ప్రభావాన్ని అడ్డుకోగలిగాం.. కోవిడ్‌పై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నందున ప్రధాని మోదీ కోవిడ్‌పై బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన ,వీడియో కాన్ఫరెన్స్‌ లో తొలుత మాట్లాడే అవకాశాన్ని తనకు కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. తిరుమల అన్నమయ్య భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలియ చేశారు. ఆ వివరాలివీ..

వేగంగా గుర్తించి వైద్యం..
► ఇలాంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న మీ (ప్రధాని మోదీ) నాయకత్వాన్ని అభినందిస్తున్నా. ప్రపంచంలోనే అతి తక్కువ మరణాలు దేశంలో నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా మరణాల సంఖ్యను ఏపీలో బాగా తగ్గించగలిగాం.
► విపత్కర పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి వైద్య రంగంలో మౌలిక వసతులను గ్రామీణ స్థాయి దాకా మెరుగు పరుస్తున్నాం. ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు పలు సంక్షేమ, పునర్జీవన పథకాలను అమలు చేస్తూ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని అడ్డుకున్నాం.
► రాష్ట్రంలో తొలి కరోనా కేసును గుర్తించిన మార్చి నెలలో కోవిడ్‌ను నిర్థారించే ల్యాబ్‌ ఒక్కటీ లేకపోవడంతో నమూనాలను పుణె పంపాల్సి వచ్చేది. ఆ దశ నుంచి బయటపడి సదుపాయాలను గణనీయంగా పెంచాం.

సత్ఫలితాలనిస్తున్న నిర్ణయాలు..
► రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 98,000 పరీక్షలను నిర్వహిస్తున్నాం. జనాభాలో 10% మందికి పరీక్షలు చేశాం.
► ఆసుపత్రుల్లో పడకలు పెంచడంతో 25% అదనంగా అందుబాటులో ఉన్నాయి. కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో కూడా పడకలు, చికిత్స కోసం భయపడాల్సిన పరిస్థితి లేదు.
► ఇప్పటిదాకా మొత్తం 52 లక్షలకు పైగా పరీక్షలు చేయగా 6,39,302 పాజిటివ్‌ కేసులను గుర్తించాం. రోజువారీ పరీక్షల సంఖ్య 60,000 నుంచి 70,000కిపైగా పెంచాం.
► పాజిటివిటీ రేటు వేగంగా తగ్గుతూ వస్తోంది. ఆగస్టులో 16.89 శాతం ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 9.92 శాతానికి తగ్గింది. రోజు వారీ కేసులు 11,000 నుంచి 7,500కి పరిమితమయ్యాయి. రికవరీ రేటు 88.9 శాతానికి పెరిగింది.
► రోజువారీ మరణాల సంఖ్య 100 నుంచి 50కి తగ్గింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కోవిడ్‌ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుని  తగ్గుముఖం పట్టాయని అంచనా వేస్తున్నాం.
► గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాం.
► ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోవిడ్‌ నివారణలో సత్ఫలితాలనిస్తున్నాయి.

కోవిడ్‌పై పోరులో కీలకంగా సచివాలయ వ్యవస్థ..
రాష్ట్రంలో 11,152 గ్రామ, 3913 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి మొత్తం 2.69 లక్షల మంది వలంటీర్లను నియమించాం. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నాం. కోవిడ్‌పై పోరాటంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాలుపంచుకున్నారు. రాష్ట్రంలో 11,152 విలేజ్‌ క్లినిక్స్, 563 అర్బన్‌ వార్డు క్లినిక్స్‌ ఏర్పాటు చేశాం.

అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా..
రాష్ట్రంలో నర్సింగ్‌ కాలేజీలతోపాటు 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గత సమావేశంలో మిమ్మల్ని కోరాం.దీనిపై మీరు స్పందించి క్యాబినెట్‌ కార్యదర్శితో మాట్లాడి మంజూరు చేయడంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించే అవకాశం లభిస్తోంది.  

మరిన్ని వార్తలు