26న విశాఖకు సీఎం జగన్‌

21 Aug, 2022 03:28 IST|Sakshi

సాగర తీర పరిరక్షణకు ‘పార్లే’తో ప్రభుత్వం ఎంవోయూ

ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించి.. రీ సైకిల్‌ చేయనున్న పార్లే

సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకోనున్న అధికారులు, పార్లే ప్రతినిధులు

మెక్రోసాఫ్ట్‌ శిక్షణ అందించిన 5 వేల మందికి సీఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు  

సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 26న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని సాగర తీర పరిరక్షణ కోసం అమెరికా (న్యూయార్క్‌)కు చెందిన పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య బీచ్‌ పరిరక్షణపై ఎంవోయూ జరుగుతుందని కలెక్టర్‌ డా.మల్లికార్జున శనివారం మీడియాకు తెలిపారు.

సాగర గర్భంలోనూ, తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని పార్లే సంస్థ సేకరించి.. వాటిని రీ సైకిల్‌ చేసేందుకు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించిన ఒప్పంద కార్యక్రమాన్ని ఈ నెల 26న ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ.. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న 5 వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏయూ ఇంజినీరింగ్‌ మైదానంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు