వైఎస్సార్‌ జగనన్న కాలనీ పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం జగన్

30 Dec, 2020 13:04 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం పర్యటన

సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని  ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. మరికొద్దిసేపట్లో గుంకలాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అదే విధంగా అక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. సభావేదిక వద్ద ఇళ్ల లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సీఎం ముందుకెళ్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 

మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత దేశ చరిత్రలోనే లేదని.. ఆ ఘనత కేవలం సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ అండగా నిలిచారని సీఎం వైఎస్ జగన్‌.. మహిళా సాధికారత ఛాంపియన్ అని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు.

అంతకు ముందు విజయనగరం బయలుదేరిన సీఎం జగన్‌కు విశాఖ ఎయిర్ పోర్టులో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా స్వాగతం పలికారు.

గుంకలాంలో 397.36 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్‌ను అధికారులు సిద్ధం చేశారు. 12,301 మంది లబ్ధిదారుల కోసం ఈ అతిపెద్ద లేఅవుట్‌ను 6 బ్లాకులుగా రూ.4.37 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1,164 లేఅవుట్‌లను అధికారులు సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు