విశాఖలో నౌకల పండుగ.. ముఖ్య అతిథిగా సీఎం వైఎస్‌ జగన్‌

27 Feb, 2022 03:50 IST|Sakshi
విశాఖ తీరంలో విద్యుత్‌ కాంతులతో నౌకలు

మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న సీఎం

భారత్‌తోపాటు 39 దేశాల నౌకాదళాల విన్యాసాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/బీచ్‌ రోడ్డు (విశాఖ తూర్పు): అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్‌–2022లో కీలకమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను బీచ్‌ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్‌ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ ఆదివారం జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

సీఎం పర్యటన ఇలా..
బీచ్‌ రోడ్డులో కోలాహలంగా జరిగే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ నగరానికి ఆదివారం రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మ. 2.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేవల్‌ డాక్‌ యార్డ్‌కి చేరుకుంటారు. 3.10 గంటలకు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. అనంతరం నౌకాదళ సిబ్బందితో కలిసి దానిని పరిశీలిస్తారు. సా.4.10 గంటలకు నేవీ అధికారులతో గ్రూపు ఫొటో దిగుతారు. 4.20 నుంచి 4.40 వరకు ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సందర్శిస్తారు.

అనంతరం ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌లో బస చేస్తారు. సా.5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని మిలాన్‌ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 6.04 గంటలకు సిటీపరేడ్‌ను ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేశాల నౌకాదళ రక్షణ సిబ్బంది నిర్వహించే మార్చ్‌ పరేడ్‌ను తిలకిస్తారు. సా.6.50కు విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గన్నవరం బయలుదేరుతారు.
సాగర తీరంలో విద్యుత్‌ కాంతులతో నౌకలు 

ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ విన్యాసాలు
ఇక భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు, మెరైన్‌ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్‌ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి.

ఘనంగా మిలాన్‌–2022 ప్రారంభం
నౌకా యానంలో భారత్‌కు ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, పశ్చిమ తీరం ద్వారా 80 దేశాలతో వర్తకం సాగిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ అన్నారు. ఆయన శనివారం విశాఖలో మిలాన్‌–2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో భారత్‌తో పాటు నాలుగు దేశాలతో మొదలైన మిలాన్‌ ఇప్పుడు 39 దేశాలకు విస్తరించటం అభినందనీయమన్నారు. మిలాన్‌ ద్వారా మారిటైం రంగంలో అక్రమ ఆయుధ రవాణా, టెర్రరిజం, సముద్ర దొంగలు, స్మగర్లకు అడ్డుకట్ట వేయటంపై చర్చించుకునేందుకు వేదిక కానుందన్నారు.

ప్రపంచ అంతా ఒక కుటుంబం అనే నినాదంతో ఒకరికొకరం సహాయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మిలాన్‌ లోగో, స్పెషల్‌ కవర్‌ను అజయ్‌భట్‌ ఆవిష్కరించారు. ఇక్కడ మిలాన్‌–22 నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత భారీ ఎత్తులో కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సహకారం ఆమోఘమని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ రకాల స్టాల్స్‌తో కూడిన మిలాన్‌ విలేజ్‌ను ఆయన ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు