‘సోమశిల రెండో దశ’కు నేడు శ్రీకారం

9 Nov, 2020 03:42 IST|Sakshi

వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు

సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశతో 46,453 ఎకరాలకు నీళ్లు

సాక్షి, అమరావతి: సోమశిల రిజర్వాయర్‌ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ (ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ) రెండో దశ పనులకు సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4.28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను పూర్తి చేసి.. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.

శరవేగంగా పూర్తికి ప్రణాళిక
ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ తొలి దశలో మిగిలిన పనులతో పాటు రెండో దశ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించింది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకుతోడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. 

రివర్స్‌ టెండరింగ్‌తో రూ.67.9 కోట్లు ఆదా
2014లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ తొలి దశ పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. కాగా ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం, ఓట్ల కోసం ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ రెండో దశ పనులకు రూ.503.37 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంపిక చేసిన సంస్థకు రూ.4.79 శాతం అధిక ధర (రూ.527.53 కోట్లకు)కు అప్పగించింది. అంటే ఖజానాపై రూ.24.16 కోట్ల భారం వేసిందన్నమాట. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఈ పనులకు సంబంధించి తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ రెండో దశ టెండర్‌ను రద్దు చేసింది. టీడీపీ సర్కార్‌ నిర్ణయించిన రూ.503.37 కోట్ల అంచనా వ్యయంతోనే టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రివర్స్‌ టెండరింగ్‌లో 8.69 శాతం తక్కువ ధరకు అంటే రూ.459.63 కోట్లకు కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. టీడీపీ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు 8.69 శాతం తక్కువ ధరకు అప్పగించడం వల్ల మొత్తంమీద 13.48 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినట్లయింది. దీని వల్ల ఖజానాకు రూ.67.9 కోట్లు ఆదా అయ్యాయి. 

చదవండి: రూ. 820 కోట్లతో ఎన్‌హెచ్‌–167కె నిర్మాణం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా