నెల్లూరుకు నగిషీ.. వందేళ్ల కల సాకారం

5 Sep, 2022 03:35 IST|Sakshi

6వ తేదీన బ్యారేజీ ప్రారంభం.. వందేళ్ల కల సాకారం

జాతికి అంకితం చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఆంగ్లేయుల కాలంలో పెన్నాపై ఆనకట్ట నిర్మాణం.. శిధిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి

ఏమాత్రం వరద వచ్చినా నెల్లూరు– కోవూరు మధ్య రాకపోకలు బంద్‌

ఆనకట్ట స్థానంలో బ్యారేజ్‌ నిర్మించాలని 1904 నుంచి ప్రజల వినతి

జలయజ్ఞంలో భాగంగా సాకారం చేస్తూ వైఎస్సార్‌  అడుగులు.. రూ.86.62 కోట్లతో బ్యారేజ్‌ పనులను కొలిక్కి తెచ్చిన మహానేత 

రాష్ట్ర విభజన తరువాత అటకెక్కించిన టీడీపీ సర్కార్‌ 

రెండేళ్ల తర్వాత అంచనా వ్యయాన్ని పెంచేసి కమీషన్లకే ప్రాధాన్యం

రూ.71.54 కోట్లు మట్టిపాలు.. పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు

అధికారంలోకి రాగానే నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టిన సీఎం 

కరోనా, వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 51 గేట్లతో సహా పూర్తి

(నెల్లూరు బ్యారేజ్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజ్‌ సాకారమవుతోంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్‌ చేపట్టిన నెల్లూరు బ్యారేజ్‌ పనులను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌ను ఈనెల 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. బ్యారేజ్‌ ద్వారా సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది.

బ్యారేజ్‌ను పూర్తి చేసి నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్‌ శాశ్వతంగా పరిష్కరించారు. వరద నియంత్రణ ద్వారా ముంపు ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ 2 వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడంతో  నెల్లూరు–కోవూరు మధ్య రవాణా ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. దీంతోపాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని కూడా సీఎం జగన్‌ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

ఆంగ్లేయుల కాలంలో...
1854–55లో ఆంగ్లేయుల హయాంలో నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్ట నిర్మించి అరకొరగా మాత్రమే ఆయకట్టుకు నీళ్లందించారు. 1862లో భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్ట నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలం కావడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు తాగునీటికి తల్లడిల్లింది. ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా రాకపోకలు స్తంభించిపోయేవి.

ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరును ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి నిర్మించాలని 1904 నాటి నుంచి నెల్లూరు ప్రజలు కోరుతున్నా 2004 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో 2008 ఏప్రిల్‌ 24న చేపట్టారు. ఆయన హయాంలో బ్యారేజ్‌ పనులు పరుగులెత్తాయి. రూ.86.62 కోట్లను ఖర్చు చేశారు. మహానేత హఠాన్మరణం నెల్లూరు బ్యారేజ్‌కు శాపంగా మారింది. 

నాడు కాలయాపన.. కమీషన్లకే ప్రాధాన్యం
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్‌ నెల్లూరు బ్యారేజ్‌ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బ్రిటీష్‌ సర్కార్‌ నిర్మించిన పాత ఆనకట్టకు పది మీటర్ల ఎగువన 10.9 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా 640 మీటర్ల వెడల్పుతో నెల్లూరు బ్యారేజ్‌ నిర్మాణాన్ని చేపట్టారు. పాత ఆనకట్ట వల్ల వరద ప్రవాహం వెనక్కి ఎగదన్నడం బ్యారేజ్‌ నిర్మాణానికి సమస్యగా మారింది.

పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజ్‌ నిర్మిస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్‌ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 2016 వరకూ టీడీపీ సర్కార్‌ దీన్ని పరిశీలించకుండా జాప్యం చేసింది. ఆ తరువాత డిజైన్లలో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించింది. కాంట్రాక్టర్‌ నుంచి కమీషన్లు రాబట్టుకునే పనులకే ప్రాధాన్యం ఇచ్చింది. 2016 నుంచి 2019 మే 29 వరకూ రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా బ్యారేజ్‌లో 57 ఫియర్లను (కాంక్రీట్‌ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్‌ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది.

నేడు ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తి..
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2020 మార్చి నుంచి 2021 చివరిదాకా కరోనా మహమ్మారి మూడు దఫాలు విజృంభించింది. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో వరుసగా భారీ వరదలు వచ్చాయి. నెల్లూరు బ్యారేజ్‌ నుంచి 2019–20లో 45.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయంటే ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో అంచనా వేయవచ్చు.

వరద ఉద్ధృతికి బ్యారేజ్‌కు ఎగువన ఆయకట్టుకు నీళ్లందించడం కోసం తాత్కాలికంగా నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ (మట్టికట్ట) దెబ్బతిన్నది. వరదలు తగ్గాక మళ్లీ మట్టికట్టను సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్‌ పనులు చేయడం సవాల్‌గా మారింది. ఈ తీవ్ర ప్రతికూలతల్లోనూ బ్యారేజ్‌లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

57 పియర్ల మధ్య పది మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు (స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు) వెరసి 51 గేట్లను ఏర్పాటు చేసింది. గేట్లను ఎత్తడం, దించడానికి వీలుగా ఎలక్ట్రిక్‌ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా కుడి, ఎడమ కరకట్టలను పటిష్టం చేసేందుకు రూ.77.37 కోట్లను ఖర్చు చేశారు. 

నూతన అధ్యాయం..
నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ బ్యారేజీని పూర్తి చేశారు. ఈనెల 6న నెల్లూరు బ్యారేజ్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనున్నారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీటితోపాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.
– అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి

పెరగనున్న భూగర్భ జలమట్టం..
నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కరోనా, వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులు కొనసాగాయి. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు మార్గదర్శకాల మేరకు సవాల్‌గా తీసుకుని పెన్నా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటి సరఫరాతోపాటు బ్యారేజ్‌లో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యకు సీఎం జగన్‌ శాశ్వత పరిష్కారాన్ని చూపారు.
– సి.నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ.

వరద ఉద్ధృతిలోనూ..
పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా భారీ వరదలు వచ్చాయి. మట్టికట్ట కొట్టుకుపోవడంతో దాన్ని సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్‌ పనులు పూర్తి చేయడం సవాల్‌గా మారింది. వరద ఉద్ధృతిని అధిగమించి సీఎం జగన్‌ నిర్దేశించిన గడువులోగా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఈ బ్యారేజ్‌ పూర్తవ్వడంతో నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కల నెరవేరుతోంది.
– హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ

మరిన్ని వార్తలు