అక్టోబర్‌ 7న ఒంగోలుకు సీఎం జగన్‌

5 Oct, 2021 10:53 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు రానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముందుగా పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాన్ని మంత్రి బాలినేని, తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌ వకుల్‌ జిందాల్, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎస్పీ మలికాగర్గ్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం క్రీడా మైదానంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వారు చర్చించారు. క్రీడా మైదానంలో దక్షిణ భాగంలో ముఖ్యమంత్రి సభావేదిక ఉండాలన్నారు. 23 నెలల తరువాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు.


పీవీఆర్‌ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌ వకుల్‌ జిందాల్, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎస్పీ మలికాగర్గ్‌ 

మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 9 గంటలకు మహిళలు పీవీఆర్‌ ఉన్నత పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. కోవిడ్‌ నిబంధనలు అనుసరించి 20 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో హెలిపాడ్‌ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూటుకు ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు మార్గానికి అడ్డు రాకుండా సీఎంకు అభివాదం చేసేందుకు వీలుగా బ్యారికేడ్ల ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెలిపాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.  

సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆసరా రెండో విడతలో మహిళలకు నగదు పంపిణీ కార్యక్రమం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జిల్లాకు వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నందున విజయవంతం చేసే బాధ్యత మహిళలపై ఉందన్నారు. కేవలం రెండు రోజుల సమయంలో సభా ఏర్పాట్ల విషయంపై కొందరు అనుమానం వ్యక్తం చేయగా ‘ఒంగోలులో వాసన్న ఉన్నాడు కదా చూసుకుంటాడు’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్లు తలశిల తెలిపారు.
 
కోవిడ్‌ రెండు టీకాలు వేయించుకుంటేనే అనుమతి:  
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ రెండు టీకాలు వేయించుకున్న వారినే కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. ప్రాంగణంలో స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, నగరంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించాలని, కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి వివరించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాల్లోను సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్,  ఎస్పీ మలికాగర్గ్, జేసీలు జేవీ మురళి, కె.కృష్ణవేణి, ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత, డీఆర్‌వో ఎస్‌.సరళావందనం, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ టి.రవికుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఇలా 
సీఎం పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మీడియాకు విడుదల చేశారు. ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో హెలికాప్టర్‌ దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్‌ నుంచి బయల్దేరి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిముషాలపాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు  కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు.

మరిన్ని వార్తలు