మహిళలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

8 Mar, 2021 02:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గడచిన 21 నెలల్లో మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు.

అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. నామినేటెడ్‌ పోస్టులతోపాటు నామినేషన్‌ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం కోసం దిశ బిల్, ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చినట్టు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.  

సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక భూమిక
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 
సాక్షి, అమరావతి: జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించడంలో భారతీయ మహిళలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తున్నారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజాభివృద్ధిలో మహిళలు స్ఫూర్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనా మహమ్మారిపై పోరులో మహిళా శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు సాధారణ మహిళలు కూడా ముఖ్య భూమిక వహించారన్నారు.   

మరిన్ని వార్తలు