వైఎస్సార్‌ జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన

15 Feb, 2023 16:43 IST|Sakshi

Updates:

ముగిసిన సీఎం జగన్‌, వైఎస్సార్‌ జిల్లా పర్యటన. కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం, ఆపై గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. 

 పులివెందుల మండలం నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ అతిథిగా హాజరయ్యారు. 

దేవుడి దయతో మనకు మంచి రోజులు: సీఎం జగన్‌

దేవుడి దయతో వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్‌. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.

‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్‌ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్‌ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

వైఎస్సార్‌ చూపిన బాటలో సీఎం జగన్‌: సజ్జన్‌ జిందాల్‌

మహానేత వైఎస్సార్‌ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్‌ జిందాల్‌ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్‌ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్‌ చూపిన బాటలోనే సీఎం జగన్‌ నడుస్తున్నారని సజ్జన్‌ జిందాల్‌ అన్నారు.

వైఎస్సార్‌ కన్న కలను సీఎం జగన్‌ నెరవేర్చారు: మంత్రి అమర్‌నాథ్‌

స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టించారని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కొందరు కుయుక్తులు పన్నారన్నారు. వైఎస్సార్‌ కన్న కలను సీఎం జగన్‌ నెరవేర్చారని, వైఎస్సార్‌ జిల్లా కూడా ఉక్కు నగరంగా మారబోతుందని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

ప్రజల కల సాకారం.. గర్వంగా ఉంది: ఎంపీ అవినాష్‌రెడ్డి..

రాయలసీమ ప్రజల కల సాకారమవుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. వేల మందికి ఉపాధి దొరుకుతుండటం గర్వంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగనుందని, స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా జిల్లా ముఖచిత్రం మారబోతుందని అవినాష్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి


రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌ కృషితో జిల్లా ప్రజల కల నెరవేరుతుందన్నారు.

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు.

పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

చిరకాల స్వప్నం నెరవేరే రోజు
రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమైంది. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరుతోంది. తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధి చెందాలనే సంకల్పం మొగ్గ తొడుగుతోంది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు.

కడప గడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చారు. తద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంకల్పించారు. అలాగే అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుందని భావించారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. అయితే ఎన్నికలకు ముందు 2018లో ఓ పునాది రాయితో చంద్రబాబు సర్కార్‌ సరిపెట్టింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలనే ఆశయాన్ని భుజానికెత్తుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌ 23న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. ప్రజలు బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల తక్షణ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. 

జేఎస్‌డబ్ల్యు స్టీల్స్‌ లిమిటెడ్‌చే భూమి పూజ..
చెప్పిన మాట ప్రకారం జేఎస్‌డబ్లు్య స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డిసెంబర్‌లో జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్లు్య స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్‌ నంబర్‌ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు.

తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్‌ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్లు్య సిద్ధమైంది. అందుకోసం ఫేజ్‌–1లో రూ.3,300 కోట్లు  వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్‌–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్‌ రాడ్స్, బార్‌ మిల్స్‌ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్‌–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్‌–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులేన్ల రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్‌ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు, విద్యుత్‌ సరఫరా, కాంపౌండ్‌ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్‌–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్ల తో 12 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు.

అలాగే ఎర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్‌ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తి అయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తయింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు