ఫిబ్రవరికి ‘వైఎస్సార్‌ వేదాద్రి’

29 Aug, 2020 03:48 IST|Sakshi
ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతం

ఎత్తిపోతల పథకం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

దృఢ సంకల్పంతో పూర్తి చేసి, తాగు.. సాగు నీరిస్తాం

గత ప్రభుత్వం ఐదేళ్లూ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు

అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో శ్రీకారం చుట్టాం

పెళ్లి రోజున చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది

సాక్షి, అమరావతి/ పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్‌ ద్వారా శంకుస్థాపన చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోని కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి. ఐదేళ్లపాటు అధికారంలో ఉండీ కూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 
ఎత్తిపోతల పథకానికి క్యాంపు కార్యాలయంలో వీడియో లింక్‌ ద్వారా శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌ 

– మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. 
– ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీవీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా నీరు అందిస్తాం. 
– దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. పెళ్లి రోజున చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వేదాద్రిలో ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనిల్‌కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ విప్‌ ఉదయభాను, కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు 

రైతు బాంధవుడిగా నిలిచారు  
– వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతు బాంధవుడిగా నిలిచారని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. 
– ‘ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. వేదాద్రి వద్ద కృష్ణా నది నుంచి 26 కిలోమీటర్ల పైపులైన్‌ ద్వారా నాగార్జునసాగర్‌ కాలువల్లోకి నీటిని విడుదల చేస్తారు. మంగొల్లు, గండ్రాడు, భీమవరం మీదుగా శనగపాడు వరకు ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందుతుంది. నాడు ఇదే ప్రాంతంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మేలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌ పెళ్లి రోజు కానుకగా వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత రైతాంగానికి గొప్ప వరం. తద్వారా ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.10 లక్షలు విలువ పెరిగింది’ అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు.  
–  ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే పైలాన్‌ వద్ద సీఎం తన కార్యాలయంలో రిమోట్‌ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని స్క్రీన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
– వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  
– క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతం రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు