రెండు నెలలు జాగ్రత్త

3 Aug, 2021 02:23 IST|Sakshi

కోవిడ్‌పై అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వివాహ వేడుకలు 150 మందికే పరిమితం.. ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో ప్రజలు గుమికూడకుండా చూడాలి 

మాస్కులు ధరిస్తూ భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి

45 ఏళ్లు దాటినవారితోపాటు, గర్భిణులు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం

16 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున టీచర్లకు త్వరగా టీకాలివ్వాలి

కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష 

సాక్షి, అమరావతి: థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు కోవిడ్‌ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. వివాహ వేడుకలను 150 మందికే పరిమితం చేయాలని, ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, వీటిపై మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 16వతేదీ నుంచి పాఠశాలలను తెరవనున్న నేపథ్యంలో ఆలోగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. కోవిడ్, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలివీ..

ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేయాలి
కోవిడ్‌ లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయాలి. దీనివల్ల పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇంటింటి సర్వే కొనసాగాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలి. 104 కాల్‌సెంటర్‌ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. 

వ్యాక్సినేషన్‌లో వీరికి ప్రాధాన్యం..
45 ఏళ్లు పైబడ్డవారు, గర్భిణిలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్నందున వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి.

పరిమిత అతిథులతో శుభకార్యాలు..
కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను అందరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలి. ఎక్కడా కూడా ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లిళ్ల సీజన్‌లో పెద్దఎత్తున ఒక చోటకు చేరుకునే అవకాశాలున్నాయి. తద్వారా కోవిడ్‌ వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉంది. శుభకార్యాలను వీలైనంత తక్కువమందితో నిర్వహించుకోవాలి. పెళ్లి వేడుకలను 150 మందికే పరిమితం చేయాలి. కోవిడ్‌ నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా జరిగేవరకు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలి. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి ఏ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి. మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు