ఇథియోపియాకు సహకారం అందిస్తాం

13 Oct, 2022 03:45 IST|Sakshi
ఇథియోపియా బృందంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మా సాంకేతిక సహకారం కోరడం ఆనందంగా ఉంది

గ్రామ స్థాయిలో రైతుకు సేవలందించాలన్నదే మా ఆలోచన

సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలి.. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలందాలి

ఈ ఆలోచనతోనే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చాం

ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందిస్తున్నాం

పంటల ధరలు తగ్గితే వెంటనే ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటోంది.. రైతుల సమస్యల పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం

ఇథియోపియా బృందంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సచివాలయ వ్యవస్థ చాలా ఆకట్టుకుందన్న ఇథియోపియా బృందం.. ఆర్బీకే సాంకేతికతను తమకూ అందించాలని వినతి

తప్పకుండా అందిస్తామని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఇథియోపియాలో వ్యవసాయ రంగం విస్తరణకు సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందం బుధవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సమావేశమైంది. ఆర్బీకేలు, సమీకృత రైతు సమాచార కేంద్రం, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌లో తాము తెలుసుకున్న విషయాలను, అనుభవాలను సీఎంకు వివరించింది.

ఈ వ్యవస్థలు రైతులకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని వివరించింది. ఆర్బీకే సాంకేతికతను తమ దేశంలోనూ ప్రవేశపెట్టడానికి సహకారం అందించాలని కోరింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఏ రూపంలో ఏ సహాయం కావాలన్నా తోడుగా ఉంటాం. మీ సహాయాన్ని కూడా మేము తీసుకుంటాం ’ అని చెప్పారు. ‘మీ బృందం ఆర్బీకేలను సందర్శించడం, రైతులతో మాట్లాడడం సంతోషకరం.

సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలి. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలందాలి. ఈ ఆలోచనతోనే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చాం. ప్రతి ఆర్బీకేలో పంటల సాగును బట్టి వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పట్టభద్రులను అందుబాటులో ఉంచాం. ప్రతి ఆర్బీకేలో కియోస్క్‌ పెట్టాం. ఆర్డర్‌ పెట్టిన వెంటనే నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నాం. తద్వారా కల్తీకి అడ్డుకట్ట వేశాం.

ఆర్బీకేల్లో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం. సాగవుతున్న ప్రతి పంటను ఈ–క్రాపింగ్‌ చేసి ఫిజికల్, డిజిటల్‌ రశీదులిస్తున్నాం. మార్కెట్‌లో పంట ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎం యాప్‌ను తీసుకొచ్చాం. ఎక్కడైనా ధరలు తగ్గితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు నష్టం రాకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీ సాకారమవుతున్నాయి.

ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు విచక్షణ రహితంగా వాడటాన్ని నివారించాలన్నది మరో లక్ష్యం. ఇందుకోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్‌ టెస్ట్‌ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్న విషయాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి తీసుకువస్తాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

సీఎం జగన్‌లో దార్శనికత కనిపిస్తోంది: ఇథియోపియా మంత్రి
‘ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఆర్బీకేల వ్యవస్థ మమ్మల్ని చాలా ఆకట్టుకుంది. వీటికి బీజం వేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో దూరదృష్టి, దార్శనికత కనిపిస్తోంది. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి’ అని ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్‌ మెకోనెన్‌ ఐమెర్‌ సీఎంతో జరిగిన భేటీలో చెప్పారు. ‘రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం, క్షేత్రస్థాయిలో మంచి మార్పులు తేవడం మమ్మల్ని అబ్బుర పరుస్తోంది. ఏపీలో ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడుగా నిలుస్తోంది.

వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాలను ఆర్బీకేలతో అనుసంధానం చేయడం చాలా బాగుంది. డిజిటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. ఆర్బీకేల విషయంలో మీ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వ్యవసాయ రంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం అందిపుచ్చుకుంటాం. మాకున్న పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను మీతో పంచుకుంటాం’ అని ఆయన చెప్పారు. అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఏజెన్సీ ఆఫ్‌ ఇథియోపియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాండెఫ్రో నిగుస్సియా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తున్న తీరు చాలా బాగుందని చెప్పారు.

ఆర్బీకేల వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తోందన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేలా వ్యవసాయ రంగాన్ని ఈ వ్యవస్థ తీర్చిదిద్దుతోందని తెలిపారు. రైతుల సందేహాలు, సమస్యలు.. తదితర అంశాలన్నింటికీ   క్షేత్రస్థాయిలో వన్‌స్టాప్‌ పద్ధతిలో పరిష్కారాలు సూచించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతోందని అన్నారు ఇతరులకూ ఈ వ్యవస్థ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.  పశువుల కోసం మొబైల్‌ అంబులెన్సులు ఏర్పాటు కూడా బాగుందన్నారు. ఈ విధానాలను తాము కూడా అనుసరిస్తామని చెప్పారు. ఆర్బీకేల్లో అమలు చేస్తున్న డిజిటల్‌ సొల్యూషన్స్‌లో తమకు సహకారం అందించాలని ఇథియోపియా బృందం అభ్యర్థించగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు