CM YS Jagan: 11న తిరుపతికి సీఎం 

8 Oct, 2021 04:26 IST|Sakshi

ఆ రోజే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ 

12న ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానల్స్, బూందీ పోటు ప్రారంభం  

చిత్తూరు కలెక్టరేట్‌: సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 11, 12 తేదీల్లో తిరుపతి పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారైనట్లు గురువారం కలెక్టరేట్‌కు సమాచారం అందింది. 11వ తేదీ మధ్యాహ్నం 2.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బర్డ్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం, అలిపిరి శ్రీవారి పాదాల వద్ద పైకప్పు నిర్మాణ పనులు, పాదాల మండపం వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుమలలో శిరోవస్త్రం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. ఇక 12వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఎస్వీబీసీ (కన్నడ, హిందీ) చానల్స్‌ను, రూ.12కోట్లతో ఆధునీకరించిన బూందీ పోటును ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీటీడీ అమలుచేస్తున్న నూతన కార్యక్రమాల ప్రజెంటేషన్, టీటీడీ–రైతు సాధికారక సంస్థ ఎంఓయూ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు.   

మరిన్ని వార్తలు