శవాలను వెతుకుతున్న యెల్లో రాబందులు

22 Sep, 2023 07:54 IST|Sakshi

ఎవరైనా మంచం ఎక్కితే చాలు.. అమాంతం  అక్కడ వాలిపోతోన్న  పచ్చ రాబందులు

శవం కనిపిస్తే చాలు బాబు అరెస్ట్ తట్టుకోలేక చనిపోయారంటూ ప్రచారాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ శవాల అన్వేషణలో బిజీగా ఉంది. ఎక్కడైనా ఎవరైనా అనారోగ్య సమస్యలతో మంచం ఎక్కారని తెలి స్తే చాలు అక్కడ వాలిపోతున్నారు టీడీపీ నేతలు. సదరు వ్యక్తి దురదృష్టవశాత్తూ చనిపోతే చంద్రబాబు నాయుడి అరెస్ట్ వార్త తట్టుకోలేక గుండెలు ఆగి చనిపోయారంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయించేస్తున్నారు. ఈ దిగజారుడు వ్యవహారాన్ని చూసి గ్రామీణాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మరీ ఇంత పాతాళానికి పడిపోవాలా..? అని వారు నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయారని టీడీపీ ప్రచారం చేస్తోన్న వారి మరణాలకు చంద్రబాబు కారణం కానే కాదని మృతుల బంధువులు చెబుతున్నారు.

✍️తమ నాయకుణ్ని ఏ పోలీసూ టచ్ చేయలేరని .. ఏ చట్టమూ అరెస్ట్ చేయించనే లేదని.. ఏ న్యాయమూర్తీ  జైలుకు పంపలేరని  గట్టిగా నమ్ముతూ వచ్చిన టీడీపీ నేతలు.. చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయాలు చేసే  పవన్ కళ్యాణ్ వంటి  నేతలకు  స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలకు తరలించడం మింగుడు పడ్డం లేదు. ఆఖరికి చంద్రబాబు  నాయుణ్ని కూడా అరెస్ట్ చేసేస్తారా? మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడరా? అంటూ పవన్ కళ్యాణ్ లాంటి వారు గొంతు చించుకుంటున్నారు.

✍️చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేస్తే   రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి  సివిల్ వార్ కు సిద్ధమైపోతారని టీడీపీ నేతలు అనుకున్నారు. అటువంటిది టీడీపీ  ఆందోళనలకు పిలుపునిచ్చినా ప్రజల నుండి స్పందన లేకపోవడంతో టీడీపీ వ్యూహకర్తలకు వెన్నులో చలి పుట్టినట్లుంది. చంద్రబాబు ఇమేజ్ ని పెంచడానికి ఏం చేయాలా అని ఆలోచించిన టీడీపీ మేథావులు కొత్త చిట్కా కనిపెట్టారు. గ్రామాల్లో  దీర్ఘకాల వ్యాధులతో..సవాలక్ష అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారు ఎపుడు చనిపోతారా అని ఎదురు చూస్తున్నారు.

✍️ఏ ఊళ్లోనైనా ఎవరైనా  పాత జబ్బులతో ప్రాణాలు వదిలితే.. చంద్రబాబు నాయుడి అరెస్ట్ వార్తను టీవీలో చూసి తట్టుకోలేక గుండెలు పగిలి చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ చెప్పిందే ఆలస్యం ఎల్లో మీడియా ఆ కథనాలను అచ్చోసి జనంపైకి వదిలేస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా  చింతలపూడి నియోజక వర్గం జంగారెడ్డి గూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన భీమడోలు వెంకయ్య గుండె సంబంధిత రుగ్మతలతో ఈ నెల 10న కన్నుమూశారు. అంతే టీడీపీ అనుకూల మీడియాలో ఆయన చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేయడాన్ని టీవీలో చూసి బాధతో విల విల్లాడిపోయారని ఆ క్రమంలోనే గుండెపోటుతో మరణించారని  వార్తలు ప్రచురించేశారు.

✍️పత్రికల్లో ఈ వార్తలు చూసిన  పేరంపేట గ్రామస్థులు  ఇవేం వార్తలు ఇదేం దారుణం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. భీమడోలు వెంకయ్య చంద్రబాబు అరెస్ట్ కు పది రోజుల ముందునుంచే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని బంధువులు చెబుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదు. టీవీ చూసే అలవాటూ ఆయనకు లేదు. ఆయన్ను ఏరియా ఆసుపత్రికి తరలించగా  అక్కడ కొన్ని పరీక్షలు చేసి ఏలూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు కూడా వెంకయ్య పరిస్థితి ఆశాజనకంగా లేదని చెప్పడంతో విజయవాడ తీసుకెళ్‌లారు. అక్కడ ఆసుపత్రిలో చేరిన కొద్ది సేపటికే వెంకయ్య కన్నుమూశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్కూ వెంకయ్య మరణానికీ సంబంధం లేదని గ్రామస్థులు,వెంకయ్య బంధువులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

✍️తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలంటున్నారు గ్రామస్థులు. అనారోగ్యంతో చనిపోయిన వారి శవాలను టీడీపీ చంద్రబాబు ఖాతాలో వేసుకోవడం దుర్మార్గమంటున్నారు వారు. ఇదే జిల్లా పోలవరం నియోజక వర్గం కొయ్యల గూడెం మండలం యర్రంపేట గ్రామానికి చెందిన గుడివాడ పిచ్చి లింగం   రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా కాలంగా మంచంపై  ఉంటున్నారు. ఈయన మరణాన్ని కూడా టీడీపీ తమ సొంతం చేసేసుకుంది. ఎల్లో మీడియా కోరస్ పాడేసింది. పొద్దున్నే చంద్రబాబు నాయుడి అరెస్ట్ వార్తను టీవీలో చూసిన పిచ్చి లింగం తన అభిమాన నాయకుడికి ఇంత దుర్గతి పట్టిందా అని బాధతో గుండె ఆగి చనిపోయారన్నది టీడీపీ, ఎల్లో మీడియాలు అల్లిన కథ. అసలు విషయం ఏంటంటే ఈయనకు కొద్ది రోజులుగా చూపు కూడా సరిగ్గా లేదు. టీవీ చూసే అలవాటు లేదు. వారం రోజులుగా రేపా మాపా అన్నట్లు తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ తెల్లవారు జామున మూడున్నర గంటలకు చనిపోయారు. వృద్ధాప్యపు రుగ్మతలతో దీర్ఘ కాలపు అనారోగ్యంతో చనిపోయిన వారిని కూడా తెలుగుదేశం నేతలు  తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం నీచాతి నీచం అంటున్నారు స్థానికులు

✍️46 ఆర్ధిక నేరం చేసిన అభియోగాలతో జైలుకు వెళ్లిన చంద్రబాబు గురించి సామాన్య ప్రజలు ఎందుకు ప్రాణాలు వదులుతారని  వారు నిలదీస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్తో  తెలుగుదేశం నేతలకు దిక్కుతోచడం లేదు. జనం తమవైపు లేరని తెలిసి  నిద్రపట్టడం లేదు. అంతా తమవైపే ఉన్నారని చాటి చెప్పుకోడానికి శవాలనూ వదలడం లేదు. ఇదే ఇపుడు  ఆ పార్టీ ప్రతిష్ఠను మరింతగా దిగజారుస్తోంది.
-సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు