అగ్రరాజ్యాలకు దీటుగా.. సాగర జలాల్లో ఇక నిరంతర నిఘా!

1 Jan, 2023 08:30 IST|Sakshi
కోస్ట్‌గార్డ్‌ షిప్‌ నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న మల్టీకాప్టర్‌ డ్రోన్‌ 

10 మల్టీకాప్టర్‌ డ్రోన్‌లను వినియోగించనున్న ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌

సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటూ డిఫెన్స్‌ సెక్టార్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. కేవలం నౌకాదళం, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే కాకుండా... సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అగ్రరాజ్యాలకు దీటుగా బలాన్ని, బలగాన్ని పెంచుకుంటోంది. వైరి దేశాల కవ్వింపు చర్యలకు సరైన సమాధానం ఇచ్చేందుకు నిరంతరం నూతన రక్షణ వ్యవస్థలతో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా సాగర జలా­ల్లో నిరంతరం పహారా కాసేలా ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తొలిసారిగా మానవ రహిత మల్టీకాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌(ఐసీజీ) హెలికాప్టర్లకు బదులుగా... సరికొత్త సాంకేతికతతో మల్టీకాప్టర్లను తన అమ్ములపొదిలో చేర్చుకుంది. నిరంతరం పహారా కాసే సామర్థ్యం ఉన్న ఈ మల్టీకాప్టర్‌ డ్రోన్‌లు... కోస్ట్‌గార్డ్‌ రక్షణ వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. వెర్టికల్‌గా టేకాఫ్‌తోపాటు ల్యాండింగ్‌ కూడా అయ్యేలా ఇవి పనిచేస్తాయి. కోస్ట్‌గార్డ్‌ నౌకల్లోనూ, ఆఫ్‌షోర్‌ స్టేషన్‌ల నుంచి వీటిని ప్రయోగించొచ్చు.   

మూడేళ్లలో 100 మల్టీకాప్టర్లు.. 
ప్రస్తుతం కోస్ట్‌ గార్డ్‌.. తొలి విడతగా 10 మల్టీకాప్టర్లను కొనుగోలు చేసుకుంది. వీటి­ని విశాఖ, కోల్‌కతా ప్రాంతా­ల్లోని ఐసీజీ ప్రధాన స్థావరాలకు కేటాయించాలని నిర్ణయించింది. తీరప్రాంత నిఘా, భద్రత వ్యవస్థలను మరింత పటిష్టం చేసేలా.. సరిహద్దు ప్రాంతాల్లో ఈ మల్టీకాప్టర్‌ డ్రోన్‌లు రాత్రి, పగలు పహారా కాస్తాయి. నిఘా­కు మాత్రమే కాకుండా... ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లలోనూ, యాంటీ పైరసీ, యాంటీ స్మగ్లింగ్, ఆయిల్‌స్పిల్, కాలుష్య నియంత్రణ ఆపరేషన్స్‌ మొదలైనవాటికి కూడా వీటిని వినియోగించనున్నారు.

ఏడాది నుంచి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ తీర ప్రాంత భద్రతపై మరింత పట్టు సాధిం­చింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి నిర్వహించిన ఏడు జాయింట్‌ ఆపరేషన్లలో రూ.1,900 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్‌ దేశంలోకి రాకుండా స్వా«దీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లలో పాక్, ఇరాన్‌ దేశాలకు చెందిన చొరబాటుదారుల్ని కూడా అదుపులోకి తీసుకుంది. ఇకపై భద్రత వ్యవ­స్థను మరింత స్మార్ట్‌గా పటిష్టం చేసేందుకు మల్టీకాప్టర్‌లను వినియోగించాల­ని కోస్ట్‌గార్డ్‌ నిర్ణయించింది. ఇందుకోసం 2025 నాటికి మరో 100 మల్టీకాప్టర్‌ డ్రోన్‌లను కొనుగోలు చేసే దిశగా అడుగులేస్తోంది.   

మరిన్ని వార్తలు