వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంట్

3 Dec, 2020 03:37 IST|Sakshi
ఆపరేషన్‌ చేసిన వైద్యులు , శస్త్రచికిత్స పొందిన బాలుడితో తల్లిదండ్రులు

రూ.12 లక్షలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా..

ఆపరేషన్‌ చేసిన గుంటూరు వైద్యులు

ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

గుంటూరు మెడికల్‌: పుట్టుకతోనే చెవుడు సమస్యతో బాధపడుతున్న బాలుడి రెండు చెవులకు రూ.12 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ను గుంటూరులో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారు. దేశంలోనే మొదటిసారిగా రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. దీంతో గుంటూరు ఈఎన్‌టీ వైద్యులు తొలిసారిగా రెండు చెవులకు ఆపరేషన్‌ చేసి బాలుడి వినికిడి సమస్యను తొలగించారు. గుంటూరు కొత్తపేటలోని బయ్యా ఈఎన్‌టీ హాస్పిటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ బయ్యా శ్రీనివాసరావు ఈ వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన పఠాన్‌ ఆరిఫ్‌ఖాన్, రిహానాల రెండో సంతానం హర్షద్‌ఖాన్‌ (3)కు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. తల్లిదండ్రులు డాక్టర్‌ బయ్యా శ్రీనివాసరావును సంప్రదించగా ఆరునెలల కిందట ఒక చెవికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేశారు.

రెండునెలల కిందట హర్షద్‌ఖాన్‌ తల్లిదండ్రులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వివరించగా ఆయన రెండో చెవికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేసేందుకు ఆదేశాలు జారీచేశారు. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్సార్‌ మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఒక చెవికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ రెండు చెవులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బైలేటరల్‌ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించి బాలుడికి ఉచితంగా ఆపరేషన్‌ చేసినట్లు డాక్టర్‌ బయ్యా శ్రీనివాసరావు చెప్పారు. ఆరునెలల కిందట ఒక చెవికి, నవంబర్‌ 30న రెండో చెవికి విజయవంతంగా ఆపరేషన్‌ చేశామన్నారు. ఆపరేషన్‌లోసర్జన్‌ డాక్టర్‌ బయ్యా సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు