కోడి పందేలకు ‘ఐటీ’తో చెక్‌

7 Jan, 2021 19:14 IST|Sakshi

కోడి పందేలను అడ్డుకునేందుకు కొత్త వ్యూహాలు

పందేలు జరిగే ప్రాంతాల్లో ఐటీ బృందాలతో సోదాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలను అడ్డుకునేందుకు ఈ సారి జిల్లా యంత్రాంగం కొత్త వ్యూహాలను పన్నుతోంది. ఇన్‌కంట్యాక్స్‌ (ఐటీ) అధికారులతో దాడులు చేయించడం ద్వారా వీటిని అడ్డుకోవచ్చని భావించిన అధికారులు ఈ మేరకు ఆ శాఖకు లేఖ రాశారు. ఐటీ అధి కారులు కూడా 20 వరకు బృందాలను పంపడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సంక్రాంతి ముందు రెండు రోజుల నుంచి అన్ని హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లతో పాటు పందేలు జరిగే ప్రాంతాల్లో బృందాలు దాడులు చేయనున్నాయి.

కాగా, ప్రతి ఏటా సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. అయితే గత కొంత కాలంగా కోడి పందేల్లో భారీగా బెట్టింగ్‌లు జరుగుతుండటంతో అధికారులు నిఘాను పటిష్టం చేశారు. బెట్టింగ్‌ రాయుళ్ల ఆట కట్టించేందుకు ఈ సారి ఆదాయపన్ను శాఖ అధికారులను రంగంలోకి దించాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. (చదవండి: రోజూ సైకిల్‌పై 18 కి.మీ. పయనం: గ్రూప్‌–2 విజేత)

గృహ నిర్మాణ శాఖ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా శేఖర్‌
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా అదే శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తోన్న పి.బాలముని శేఖర్‌ నియమితులయ్యారు. అలాగే, చీఫ్‌ ఇంజనీర్‌ మల్లిఖార్జునను టెక్నికల్‌ ఎగ్జామినర్‌గా నియమిస్తూ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

జైళ్ల శాఖలో పోస్టుల అప్‌గ్రేడ్‌
సాక్షి, అమరావతి: జైళ్ల శాఖలో శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా జైళ్లల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(పురుషులు) పోస్టులను అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(పురుషులు)గా అప్‌గ్రేడ్‌ చేశారు. అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడపలో ఉన్న కేంద్ర జైళ్లకు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(పురుషులు) పోస్టులను కొత్తగా సృష్టించారు.  

మరిన్ని వార్తలు