రైతులకు భారం: నష్టాలు ‘కోకో’ల్లలు

18 Apr, 2021 10:56 IST|Sakshi

ధర, దిగుబడి పతనం

ధరలో తరచూ హెచ్చుతగ్గులు

రైతుకు భారంగా కూలి రేట్లు

సంక్షోభంలో కోకో సాగు  

అమలాపురం: కొబ్బరి, ఆయిల్‌పామ్‌లలో ప్రధాన అంతర పంటగా.. అదనపు ఆదాయంతో పాటు భూసారాన్ని పెంచే కోకో సాగు ఇప్పుడు రైతులకు భారంగా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సుమారు 75 వేల ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగు జరుగుతోంది. మన జిల్లాలోనే సుమారు 8,151 ఎకరాల్లో సాగవుతోంది. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ ధర తగ్గిన ప్రతిసారీ దీని ఆదాయం రైతులను ఆదుకుంటోంది. వాతావరణం సహకరించి, దిగుబడులు ఆశాజకంగా ఉన్నప్పుడు కోకో ద్వారా రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఆదాయం వచ్చిన సందర్భాలున్నాయి. గడచిన ఐదేళ్లుగా కోకో ధర ఆటుపోట్లకు లోనవుతోంది. 

ఇష్టానుసారం ధర నిర్ణయం 
కోకో గింజల నుంచి తయారు చేసే చాక్లెట్లకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతున్నా కోకో గింజల ధర మాత్రం తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 2014, 2015 సంవత్సరాల్లో కోకో గింజల సగటు ధర కేజీ రూ.192 కాగా 2016లో రూ.200కు పెరిగింది. 2017లో రూ.191కి తగ్గింది. 2018లో రూ.160కు పడిపోయింది. అప్పట్లో అంబాజీపేట, అమలాపురం మండలాల్లో రైతులు ఈ తోటలను తొలగించారు. రూ.240కి పెరిగిన ధర తాజాగా మరోసారి రూ.180కి తగ్గింది. ఏటా సాగు పెట్టుబడులు పెరుగుతుండగా, కోకో గింజల ధర తగ్గుతూ వస్తోంది. ఒకటి రెండు కార్పొరేట్‌ కంపెనీలు మాత్రమే కొనుగోలు చేయడం, వారు ఇష్టానుసారం ధర నిర్ణయించడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది.

కూలీ చెల్లింపునకే సరి.. 
ఇటీవలి కాలంలో గోదావరి జిల్లాల్లో కూలి ధరలు రైతుకు భారంగా మారాయి. పురుషులకు రూ.500 వరకూ, మహిళలకు రూ.250 నుంచి రూ.300 వరకూ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత దిగుబడికి కార్పొరేట్‌ చెల్లిస్తున్న ధర ప్రకారం ఎకరాకు రూ.27 వేలకు మించి రావడం లేదు. ఇది కూలీల చెల్లింపులకే సరిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో కోకో సాగుకు వారు క్రమేపీ దూరమవుతున్నారు. తాజాగా అమలాపురం మండలం కామనగరువులో ఒక రైతు తన పదెకరాల కొబ్బరి తోటలో ఉన్న అంతర పంట కోకోను తొలగిస్తున్నారు.

కోకో సాగు బహుళ ప్రయోజనం 
ధరలో హెచ్చుతగ్గులు వచ్చినా కోకో సాగు బహుళ ప్రయోజనం. ధర తగ్గడం అనేది తాత్కాలికం. కోనసీమ కేంద్రంగా కోకో ప్రాసెసింగ్‌ పరిశ్రమ త్వరలోనే ప్రారంభం కానుంది. స్థానికంగా కొనుగోలు పెరిగితే మంచి ధర వచ్చే అవకాశముంది. మన ప్రాంతంలో దిగుబడి వచ్చే గింజలు చాలా నాణ్యమైనవి. కానీ దిగుబడి తక్కువగా వస్తోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు వచ్చే అవకాశముంది. పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఈ స్థాయిలో దిగుబడి సాధిస్తున్నారు. అంతర పంటలు లేని సాధారణ కొబ్బరి తోటల్లో కన్నా కోకో సాగు జరిగే కొబ్బరి తోటల్లో దిగుబడి ఎక్కువ. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కోకోకు ఆకురాల్చే గుణం ఉండడం వల్ల కొబ్బరి తోటకు మంచి సేంద్రియ ఎరువు అందుతుంది. 
– నేతల మల్లికార్జునరావు, ఏడీహెచ్, అమలాపురం 

ఐదేళ్లుగా ధర తప్ప అన్నీ పెరిగాయి 
ఐదేళ్ల క్రితం కోకో గింజల ధర కేజీ రూ.200 ఉండేది. ఇప్పుడు రూ.180. ఈ ఐదేళ్లలో ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలి రేట్లు అన్నీ పెరిగాయి. కోకో గింజల ధర మాత్రం పెరగడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చుకుంటే మనకు ఎకరాకు సగం దిగుబడి మాత్రమే వస్తోంది. కనీసం కూలీలకు అవుతున్న ఖర్చు కూడా రావడం లేదు. అందుకే కోకో తోటల లీజును రద్దు చేసుకున్నాను. ఇప్పుడు అదే తోటను రైతు తొలగిస్తున్నారు. 
– సీహెచ్‌ సూర్యనారాయణరాజు, రైతు, మాగాం, అయినవిల్లి మండలం
చదవండి:
కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్‌ మాత్రం..  
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి 

మరిన్ని వార్తలు