భలే.. భలే.. కొబ్బరిపువ్వు 

28 May, 2023 04:19 IST|Sakshi

పుష్కలంగా పోషకాలు నిండి ఉన్న పువ్వు  

కాయలో నీళ్లు ఇంకిపోయాక పువ్వుగా తయారు 

కోనసీమ నుంచి పలు పట్టణాలకు జోరుగా ఎగుమతి 

మార్కెట్‌లో రూ. 30 నుంచి రూ. 100 వరకూ ధర 

సాక్షి, అమలాపురం:  దేవాలయాల్లోనో, శుభకార్యాల్లోనో కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ కొబ్బరి పువ్వు ఇప్పుడు కొంతమంది వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయాక మొక్క మొలకెత్తే సమయంలో ఈ కొబ్బరిపువ్వు కాయ లోపల తయారవుతుంది. ఈ సమయంలో కొబ్బరికాయను కొడితే లోపల దూదిలా తెల్లగా ఉండే కొబ్బరిపువ్వు ఉంటుంది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు.

గతంలో ఇవి కొబ్బరి పంట ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా లభించేవి. ఇప్పుడు మహానగరాల్లో కూడా లభిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై వంటి నగరాల్లో కొబ్బరి పువ్వుకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతాలకు గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ కొబ్బరి పువ్వు ఎగుమతి అవుతోంది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజవరం, ముంగండ, మలికిపురం మండలం రామరాజులంక, పెదతిప్ప, రాజోలు, మామిడికుదురు మండలాలతో పాటు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, దెందులూరు, పెదవేగి ప్రాంతాల్లో కొబ్బరి పువ్వు ఎక్కువగా లభ్యమవుతోంది. గోదావరి ప్రాంతం నుంచి ఈ వేసవి సీజన్‌లో రోజుకు 3 వేల నుంచి 5 వేల పువ్వులు హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకూ రోజుకు 8 వేల నుంచి 10 వేల వరకు ఎగుమతి అవుతాయి.  

కాయ కన్నా ప్రియం 
కొబ్బరి పువ్వును వాడుక భాషలో కొబ్బరి గుడ్డుగా పిలుస్తారు. హైదరాబాద్‌ వంటి నగరాల్లో కొబ్బరి గుడ్డుకు సైజును బట్టి రూ. 30 నుంచి రూ.70 వరకూ ధర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చెన్నై, బెంగళూరు మార్కెట్లకు ఈ పువ్వులు ఎగుమతి అవుతున్నాయి.

పెద్దసైజు పువ్వులను ఆ మార్కెట్లలో రూ. 100 వరకూ అమ్ముతున్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి రైతుల వద్ద నుంచి వ్యాపారులు అన్‌ సీజన్‌లో పువ్వు సైజును బట్టి రూ. 4 నుంచి రూ. 9 మధ్యలోనే కొంటున్నారు. అదే సీజన్‌లో రూ.12 నుంచి రూ.15 వరకూ ధర చెల్లిస్తున్నారు. 

నీళ్ల కంటే ఎక్కువ పోషకాలు 
కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే కూడా కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పువ్వు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డ్యామేజ్‌ వంటి జబ్బులను నివారించడంలో కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని సైతం రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్యానికి మంచిది 
కొబ్బరి పువ్వులో 66 శాతం కార్బోహైడ్రేట్లు, 64 శాతం సాల్యుబుల్‌ సుగర్స్‌ ఉంటాయి. ఫైబర్‌తో పాటు మినరల్స్, న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తినడం ఆరోగ్యపరంగా మంచిది.  – బి.శ్రీనివాసులు, వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, అంబాజీపేట, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

గతం కన్నా ఎగుమతులు పెరిగాయి 
ఐదారేళ్ల క్రితం కొబ్బరి గుడ్డు ఉచితంగా ఇచ్చే­వారు. మరీ డిమాండ్‌ ఉంటే పువ్వు రూపాయి ఉండేది. ఇప్పుడు కొబ్బరి కాయకన్నా ఎక్కువ ధర పలుకుతోంది. ఇటీవల ఎగుమతులు బాగా పెరిగాయి. కోనసీమ నుంచే కాకుండా ఏలూరు నుంచి కూడా ఎగుమతి అవుతోంది. అప్పుడప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా హైదరాబాద్‌కు కొబ్బరి గుడ్డు వస్తోంది.  – సూదాబత్తుల వెంకట రామకృష్ణ, వ్యాపారి, అంబాజీపేట 

మరిన్ని వార్తలు