టీడీపీలో ఆధిపత్య పోరు.. సీనియర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి!

16 Oct, 2022 09:15 IST|Sakshi

ఇన్‌చార్జ్‌ ఒక వైపు.. సీనియర్లు మరో వైపు 

ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు 

టికెట్‌పై ఎవరికి వారు ప్రచారాలు 

గ్రూపులుగా విడిపోయిన కేడర్‌  

కళ్యాణదుర్గం(అనంతపురం): కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు, సీనియర్‌ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సీనియర్‌ నేతలు గ్రూపులు ప్రోత్సహిస్తున్నారంటూ ఇన్‌చార్జ్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే.. ఇన్‌చార్జ్‌ తమను ఏమాత్రం గుర్తించకుండా.. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ సీనియర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ఉమాకు అనుకూలంగా మీడియాలో కథనం రావడంతో ఇరు వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు మరింత తీవ్రమయ్యాయి. ఏకంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరితో పాటు ఆయన వర్గీయులు సదరు మీడియా యాజమాన్యాన్ని కలిసి ఏకపక్షంగా వార్తలు రాయడం ఏంటని నిలదీసినట్లు సమాచారం.   

విభేదాలు మొదలైందిలా.. 
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వరనాయుడును అధిష్టానం ప్రకటించింది. తమకు కాకుండా స్థానికేతరుడికి టికెట్‌ ఇవ్వడంపై ఉన్నం వర్గీయులు భగ్గుమన్నారు. అప్పట్లో రెబల్‌ అభ్యర్థిగా ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్‌ దాఖలు చేశారు. దీనిపై అధిష్టానం జోక్యం చేసుకుని ఉన్నంను బుజ్జగించి రాజీ చేసింది. అయినా స్థానికేతరుడికి టికెట్‌ ఎలా కేటాయిస్తారంటూ లోలోన మదనపడుతూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 

అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ..  
గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కె.వి.ఉషశ్రీచరణ్‌ చేతిలో ఉమామహేశ్వరనాయుడు ఓడిపోయారు. తన ఓటమికి ఉన్నం వర్గీయులే కారణమని అప్పట్లో ఉమా ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఓ పేరును ప్రతిపాదిస్తే...ఉన్నం మరో పేరును ప్రతిపాదించి పోటాపోటీగా నామినేషన్లు వేయించారు. దీనిపై మూడేళ్ల నుంచి టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఆధిపత్య పోరుకు ఆజ్యం పోశారు. వీరి తీరుతో విసిగివేసారిన కేడర్‌ తలోదారి చూసుకుంటున్నారు. 

ఎమ్మెల్యే టికెట్‌పై ఎవరికి వారు ప్రచారాలు 
ఇటీవల ఇరు వర్గాల టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు విడివిడిగా చర్చించారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందని ఉమా చెప్పారు. ఉన్నం వర్గీయుల్లో ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదంటూ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌ చౌదరి, మాజీ ఎంపీపీ చౌళం మల్లికార్జున అభిప్రాయం వెలిబుచ్చినట్లు తెలిసింది. ఇలా ఎవరికి వారు టికెట్‌ తమకంటే తమకే    అంటూ అనుయాయుల వద్ద చెప్పుకుంటున్నారు. అయితే కళ్యాణదుర్గంలో టికెట్‌ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు స్పష్టం చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు