1,00,000 టన్నుల రంగుమారిన ధాన్యం సేకరణ

3 Jan, 2021 05:17 IST|Sakshi

రైతుల్ని ఆదుకునేందుకు నిబంధనలు సడలించిన ప్రభుత్వం

ఖరీఫ్‌లో ఇప్పటివరకు 15.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

సాక్షి, అమరావతి: ధాన్యం రంగు మారినా దిగులు పడవద్దని రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. పంట దెబ్బతిందనే బాధ లేకుండా వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోంది. అకాల వర్షాలతో ఈసారి వరిపంట నీటమునిగి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు రెండు బృందాలను పంపి పంట నష్టాన్ని అంచనా వేయించింది. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో.. రంగుమారి, పాడైన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇటీవల నిబంధనలను కూడా సడలించింది. ఇప్పటివరకు లక్ష మెట్రిక్‌ టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ సేకరించింది. నిబంధనల మేరకు వాటికి మద్దతు ధర కూడా కల్పించడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రైతులపై రవాణా భారం పడకుండా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ‘ఏ’ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,880, సాధారణ రకానికి రూ.1,868గా మద్దతు ధర నిర్ణయించిన విషయం తెలిసిందే.

పది రోజుల్లోగా బిల్లులు 
ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు రూ.2,827.93 కోట్ల విలువైన 15.11 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించింది. ఇందులో లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు రంగుమారిన, పాడైపోయిన ధాన్యం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకేల్లో) తప్పనిసరిగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. రైతుల వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసేందుకు ఆర్‌బీకేల్లో వ్యవసాయ సహాయకులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారిలో 70 వేలమంది రైతులకు సంబంధించిన బిల్లులు రూ.1,090 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమచేశారు. ధాన్యం విక్రయించిన పదిరోజుల్లోగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు 
రైతులెవ్వరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు జాయింట్‌ కలెక్టర్లతో మాట్లాడుతున్నాం. సేకరించిన ధాన్యానికి సకాలంలో బిల్లులు చెల్లించేందుకు నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నాం. త్వరలోనే రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోదాముల్లో నిల్వ చేస్తున్నాం.  
 – కోన శశిధర్, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ  

మరిన్ని వార్తలు